కడప జిల్లా పొద్దుటూరులో హృదయవిదారకరమైన ఘటన జరిగింది. ఇంటి అల్లుడు చేసిన తప్పులకు మామ, అతని ఇద్దరు కూతుళ్ళు ఆత్మహత్యలు చేసుకొన్నారు. పోలీసుల సమాచారం ప్రకారం...పొద్దుటూరులో నివాసం ఉంటున్న బాబురెడ్డికి ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్దకుమార్తె శ్వేతకు రెండేళ్ల క్రితం పొద్దుటూరులోనే ఉంటున్న సురేష్ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. అతను ఆర్నెల్ల క్రితం చేస్తున్న ఉద్యోగం మానేసి ఇంట్లోనే కూర్చోంటున్నాడు. దాంతో వారిరువురి మద్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
తన భర్త రోజూ వేధిస్తున్నాడని తండ్రికి చెప్పుకొని శ్వేత బాధపడేది. అల్లుడికి నచ్చజెప్పేందుకు బాబూరెడ్డి ఎంతగా ప్రయత్నించినప్పటికీ అతని తీరు మారకపోగా రెండు రోజుల క్రితం అతను వారి ఇంటివద్దకు వచ్చి పెద్ద గొడవ చేశాడు. గుట్టుగా బ్రతుకుతున్న తమ కుటుంబాన్ని బజారునపడేసి పరువు తీసేశాడనే బాధతో బాబూరెడ్డి భార్య భారతి, శ్వేత, చిన్న కుమార్తె సాయి ఆత్మహత్య చేసుకొంటామని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. దాంతో హతాశుడైన బాబూరెడ్డి తీవ్ర ఆవేదనతో శుక్రవారం సాయంత్రం ఇంటి బయట ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. చనిపోయేముందు సెల్ఫీ వీడియోలో ‘నా అల్లుడు సురేష్ వేధింపులు భరించలేకనే చనిపోతున్నాను. అధికారులు నా కూతురికి న్యాయం చేయండి,’ అని కన్నీళ్లు పెట్టుకొని చెప్పి ఉరివేసుకొన్నాడు.
ఇంటికి తిరిగివచ్చిన అతని భార్య, ఇద్దరు కూతుళ్ళు బాబూరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం చూసి తట్టుకోలేకపోయారు. నిన్న రాత్రంతా వారు గుండెలు పగిలేలా రోదించారు. ఆ బాధను భరించలేక శ్వేత, సాయి ఇద్దరూ కలిసి తల్లి నిద్రలేవక మునుపే ఇవాళ్ళ తెల్లవారుజామున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నారు. ఒక్క రోజు వ్యవధిలో భర్త, ఇద్దరు కూతుళ్ళను పోగొట్టుకొన్న భారతి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని శ్వేత భర్త సురేష్ కోసం గాలిస్తున్నారు.