ప్రపంచంలో లక్షలాదిమంది కరోనా మహమ్మారి బారినపడి చితికిపోతున్నారు. రోజూ వేలసంఖ్యలో చనిపోతున్నారు. వారిలో రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటోంది. కనుక కరోనాకు వ్యాక్సిన్ తయారైనప్పటికీ వారు దానిని కొనుగోలుచేయలేకపోవచ్చు.
వారి సమస్యను ముందే గుర్తించిన బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ వారికి కూడా వ్యాక్సిన్ అందుబాటు ధరలో లభించాలనే ఉద్దేశ్యంతో త్వరలో దానిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయబోతున్న సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు 150 మిలియన్ డాలర్లు (అక్షరాల రూ.1125,74,17,500.00) విరాళం రూపంలో అందజేయబోతోంది. తద్వారా ఒక్కో వ్యాక్సిన్ ధర కేవలం 3 డాలర్లు (రూ.225) కంటే తక్కువకే లభించనుంది. దీని కోసం బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్, ద వ్యాక్సిన్ అలయన్స్ (గవి), సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒప్పందం చేసుకొన్నాయి.
దాని ప్రకారం సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 10 కోట్లు డోసులు పైగా వ్యాక్సిన్‌లు గవికి అందజేస్తుంది. ఆ సంస్థ 92 దేశాలలో నిరుపేదలకు ఈ వ్యాక్సిన్ అందజేస్తుంది. ప్రపంచంలో నిరుపేద దేశాలు వ్యాక్సిన్లు పొందలేక రోగాలలో కూరుకుపోతున్నాయని, ఇప్పుడు కరోనా కోరలలో చిక్కుకుపోయిన ఆ పేదదేశాలలో నిరుపేద ప్రజలను ఆదుకోవలసిన బాధ్యత ఉందని భావించి ఇందుకు పూనుకొన్నామని బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ మరియు గవి సీఈఓ డాక్టర్ సేథ్ బెర్క్ లీ అన్నారు. అటువంటి మహోన్నతమైన కార్యక్రమంలో భాగస్వాములమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత ఆదార్ పూనావాలా అన్నారు. నిజమే కదా! సాహో బిల్ గేట్స్...సాహో పూనావాలా...సాహో గవి!