కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందంటూ సిఎం కేసీఆర్ అధికార నివాసం ప్రగతి భవన్‌లో ఎదుట ఇవాళ్ళ ప్రతిపక్ష పార్టీలు నిరసనలు తెలియజేయడానికి బయలుదేరగా, పోలీసులు ఎక్కడికక్కడ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌లకు తరలిస్తున్నారు. ఇవాళ్ళ ప్రగతి భవన్ ముట్టడిస్తామని ప్రతిపక్షాలు నిన్ననే ప్రకటించడంతో, ముందు జాగ్రత్త చర్యగా ప్రగతి భవన్ ముందు భారీగా పోలీసులను మోహరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సిపిఐ నేతలు నారాయణ, చాడా వెంకటరెడ్డి, సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి, టిజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ ఇంకా పలువురు ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. పేదలకు కరోనా చికిత్స అందడం లేదు కనుక కరోనాను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కరోనా భయంతో పనులులేక సమస్యలు ఎదుర్కొంటున్న పేదలందరికీ ఉచితంగా రేషన్ ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితోనే ఉందని చెప్పవచ్చు. రాష్ట్రంలో పేదలందరికీ ప్రభుత్వాసుపత్రులలో ఉచితంగా కరోనా చికిత్స అందజేస్తున్నామని, ఆసుపత్రులలో ఆక్సిజన్ సౌకర్యం కలిగినవి, సాధారణ బెడ్లు వేల సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని చెపుతోంది. ఇంకా ఎన్నివేలమంది వచ్చినా ఆసుపత్రులలో చేర్చుకొని చికిత్స అందించగలమని గట్టిగా చెపుతోంది. కనుక ఈ అంశంపై ప్రతిపక్షాల వాదనలను ప్రభుత్వం తిరస్కరిస్తున్నట్లే భావించవచ్చు.