వ్యాక్సిన్‌ తయారీకి కేంద్రం సహకరించాలి: కేటీఆర్‌

August 07, 2020


img

మంత్రి కేటీఆర్‌ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌కు గురువారం ఓ లేఖ వ్రాశారు. దానిలో కరోనా వ్యాక్సిన్‌ వేగంగా తయారుచేసి సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చేందుకు కేంద్రప్రభుత్వం వాటిని తయారు చేస్తున్న కంపెనీలకు మరింత సహాయసహకారాలు అందించాలని కోరారు. అలాగే వ్యాక్సిన్‌ తయారైన తరువాత దాని పంపిణీకి ఇప్పటి నుంచే మార్గదర్శకాలను రూపొందించాలని కోరారు. కేటీఆర్‌ లేఖలో ముఖ్యాంశాలు: 

1. ఒక్క హైదరాబాద్‌లో ఉన్న ఫార్మా పరిశ్రమలే ఏటా 5 బిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇది ప్రపంచ ఉత్పత్తిలో మూడో వంతు. 

2. కరోనా నేపధ్యంలో ఫార్మా, లైఫ్ సైన్సస్, బయో రంగాలలో రంగంలో అభివృద్ధికి అవకాశాలు ఏర్పడ్డాయి. కనుక ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని దేశంలో లైఫ్ సైన్సస్ రంగంలో పెట్టుబడులు ఆకర్షించి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వీలుగా కేంద్రప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించాలి. ముఖ్యంగా... మరింత వేగంగా  అనుమతులు మంజూరు చేయాలి.    

3. అనుమతులు, టెస్టింగ్, ట్రాకింగ్ వ్యవస్థలను వికేంద్రీకరణ చేయాలి. అలాగే సులబతరం చేయాలి. 

4. వ్యాక్సిన్‌ తయారీ చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. కనుక వ్యాక్సిన్‌ తయారుచేస్తున్న కంపెనీలకు కేంద్రప్రభుత్వం అన్ని విధాలా సహాయసహకారాలు అందించి, వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చేయాలి. 

5. బ్రిటిష్ కాలంలో హిమాచల్ ప్రదేశ్‌లో కసౌలిలో ఏర్పాటు చేసిన సెంట్రల్ డ్రగ్ లేబొరేటరీని అక్కడి నుంచి మార్చి దేశంలో అన్ని రాష్ట్రాలకు అందుబాటులో ఉండేచోట ఏర్పాటు చేయాలి. ఎందుకంటే, దేశంలో వివిద రాష్ట్రాలలో ఉన్న బయోటెక్ కంపెనీలు తమ శాంపిల్స్, రిపోర్టులు వగైరాలను అక్కడికి పంపించడానికి చాలా శ్రమపడవలసి వస్తోంది. 

6.  ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఎఫ్‌డీఏఏ సంస్థలు మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్రప్రభుత్వం కూడా ఇప్పుడే కరోనా వ్యాక్సిన్‌ లైసెన్సింగ్ కోసం మార్గదర్శకాలు రూపొందించాలి. 

7. హైదరాబాద్‌లో మూడు ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌ తయారీలో పోటీ పడుతున్నాయి.   

8. కరోనా వ్యాక్సిన్‌ సిద్దం కాగానే దానిని దేశవ్యాప్తంగా క్రమబద్దంగా పంపిణీ చేసేందుకు కేంద్రప్రభుత్వం ఇప్పుడే సమర్ధమైన, పారదర్శకతతో పని చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దానికి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలి.


Related Post