పాత సచివాలయం కూల్చివేత పనులు, శిధిలాల తొలగింపు ఈ నెలాఖరులోగా పూర్తికానున్నాయి. కనుక వచ్చే నెలలో కొత్త సచివాలయం నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖ, పర్యావరణ శాఖ, ఎయిర్ పోర్ట్ ఆధారిటీల నుంచి అనుమతులు పొందడం, అదే సమయంలో సచివాలయం నిర్మాణపనులకు టెండర్లు పిలిచి గుత్తేదారును ఎంపిక చేయడం వంటి పనులు పూర్తి చేయాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆ తరువాత గుత్తేదారు సచివాలయం నిర్మాణానికి అవసరమైన కార్మికులు, యంత్రపరికరాలు, సిమెంట్, స్టీల్, ఇసుక వంటి నిర్మాణ సామాగ్రిని ఏర్పాటు చేసుకోవడానికి మరో 15-20 రోజులు పట్టవచ్చు. కనుక అక్టోబర్ 25వ తేదీన విజయదశమినాడు కొత్త సచివాలయం నిర్మాణ పనులు ప్రారంభించేవిదంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. కొత్త సచివాలయం నిర్మాణ పనులు మొదలైన తరువాత ఎటువంటి న్యాయవివాదాలు తలెత్తకుండా ముందుగానే అన్ని అనుమతులు తీసుకొని, ఆర్ధిక అంశాలకు సంబందించి పూర్తి నివేదికలతో ఖచ్చితమైన ప్రణాళికతో పనులు చేపట్టనుంది.