రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆక్షేపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఒకపక్క రాష్ట్రంలో ప్రజలు కరోనా మహమ్మారితో నానాబాధలు పడుతుంటే, మంత్రివర్గ సమావేశంలో కొత్త సచివాలయం డిజైన్, నిర్మాణం గురించి చర్చించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. సచివాలయ నిర్మాణం కోసం 500 కోట్లు ఖర్చు చేయడానికి సై అంటున్న సిఎం కేసీఆర్, కరోనాను ఎదుర్కోవడానికి కేవలం 100 కోట్లు మాత్రమే ఇచ్చారు. సచివాలయం నిర్మాణం ముఖ్యమా... లేక ప్రజల ప్రాణాలు… జీవితాలు ముఖ్యమా? ఇది బొత్తిగా మానవత్వం లేని ప్రభుత్వం. ఇప్పటికైనా సిఎం కేసీఆర్ ప్రభుత్వాసుపత్రులలో సౌకర్యాలు కల్పించడంపై శ్రద్ద చూపితే బాగుంటుంది. తక్షణమే కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలి. లేకుంటే నేను నిరవదిక నిరాహార దీక్షలో కూర్చోంటాను. మంత్రులు కేసీఆర్ భజన మానుకొని ప్రజా సమస్యల పరిష్కరిస్తే బాగుంటుంది,” అని జగ్గారెడ్డి అన్నారు.
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, పేదలకు, వలస కార్మికులకు ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని కోరుతూ టిడిపి, సిపిఐ, సీపీఎం, టిజేఎస్, మరికొన్ని ప్రజాసంఘాలు “ముఖ్యమంత్రి మేలుకో... ప్రజలను కాపాడు” అనే నినాదంతో శుక్రవారం ఉదయం ప్రగతి భవన్ ముందు ధర్నా చేసేందుకు సిద్దమవుతున్నాయి.