ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి చంద్రబాబు వార్నింగ్

August 04, 2020


img

ఏపీలో ఓ పక్క కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే మరోపక్క అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపిల మద్య భీకర యుద్ధం జరుగుతోంది. ఏపీకి విశాఖ, అమరావతి, కర్నూలు నగరాలలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని చంద్రబాబునాయుడు తప్పు పట్టారు. ఎన్నికలకు ముందు అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి, అధికారంలోకి రాగానే రాజధానిని విశాఖకు తరలించడానికి సిద్దపడటం తనకు ఓటువేసి గెలిపించిన ప్రజలను మోసం చేయడమేనని చంద్రబాబునాయుడు వాదిస్తున్నారు. కనుక ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి 48 గంటలలోపు తన నిర్ణయం వెనక్కు తీసుకోవాలని లేకుంటే శాసనసభను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు సిద్దం కావాలని సవాలు విసిరారు. ఒకవేళ ఎన్నికలలో ప్రజలు మళ్ళీ వైసీపీనే గెలిపిస్తే ఇకపై మరెప్పుడూ రాజధాని అంశం గురించి ప్రశ్నించబోమని చంద్రబాబునాయుడు అన్నారు. రాజధాని కోసం రాజీనామాలు చేయడానికి తమకు క్షణం పట్టదన్నారు చంద్రబాబునాయుడు. ఒకవేళ 48 గంటలలో ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించకపోతే, అమరావతిలో రాజధాని ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఏవిధంగా కృషి చేసిందీ...దానిపై ఎంత ఖర్చయిందీ...అక్కడి నుంచి రాజధానిని విశాఖకు తరలిస్తే ఏపీ ప్రజలు ఏవిధంగా నష్టపోతారు... వంటి పూర్తివివరాలతో ప్రజల ముందుకు వెళ్ళి వైసీపీ ప్రభుత్వం వారిని ఏవిధంగా మోసం చేస్తోందో వివరిస్తానని హెచ్చరించారు. 

అయితే ఇటువంటి తాటాకు చప్పుళ్ళకు తాము భయపడేది లేదని, ఒకవేళ చంద్రబాబునాయుడుకు తన వాదనలపై అంత నమ్మకమే ఉంటే, ఆయనతో సహా టిడిపి ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళినట్లయితే ప్రజలు ఏమనుకొంటున్నారో తెలుసుకోవచ్చని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.


Related Post