తెలంగాణకు మూడు ప్రతిష్టాత్మక అవార్డులు

July 31, 2020


img

తెలంగాణ ప్రభుత్వం మూడు ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికైంది. పరిపాలనలో నూతన విధానాలను అమలుచేస్తున్న ప్రభుత్వాలను గుర్తించి ఏటా ఈ అవార్డులు అందజేస్తుంటుంది స్కోచ్ సంస్థ. ఇటీవల డిల్లీలో జరిగిన ఆ సంస్థ 66వ వార్షిక సదస్సులో టీఎస్‌ఎండీసీకి గోల్డెన్ అవార్డ్, ఐ‌టి శాఖకు రెండు రజత అవార్డులను ప్రకటించింది. డిజిటల్ ఇండియా కేటగిరీలో ఇసుక అమ్మకాలు, ఇసుక సరఫరాకు టీఎస్‌ఎండీసీ రూపొందించిన సాండ్ మేనేజిమెంట్ విధానానికి గోల్డెన్  అవార్డును ప్రకటించింది. ఈ కేటగిరీలో మొత్తం 1,000 దరఖాస్తులు రాగా వాటిలో తెలంగాణకు చెందిన టీఎస్‌ఎండీసీ గోల్డెన్ అవార్డ్ గెలుచుకొంది. టీఎస్‌ఎండీసీ రూపొందించిన ఈ నూతన ఇసుక విధానం ద్వారా రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1,000 కోట్లు ఆదాయం సమకూరుతోంది. 

ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ (కృత్రిమ మేధస్సు), బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ప్రభుత్వావసరాలకు తగినట్లు సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేసినందుకు ఐ‌టి శాఖ రెండు రజత అవార్డులు గెలుచుకొంది. కృత్రిమ మేధస్సు విధానంలో ఐ‌టి శాఖ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ పోలీస్ శాఖ వినియోగించుకొని మేడారం జాతరకు వచ్చిన లక్షలాదిమంది భక్తులను చాలా సమర్ధంగా నియంత్రించింది. తత్ఫలితంగా జాతరలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చాలా ప్రశాంతంగా ముగిశాయి. ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ టెక్నాలజీని ఆచరణకు అనుకూలంగా రూపొందించినందుకు రజత అవార్డు లభించింది. 

చిట్ ఫండ్ సంస్థల మోసాలను, రిజిస్ట్రేషన్స్ మోసాలను అరికట్టేందుకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగించుకొని సత్ఫలితాలు రాబట్టినందుకు ఒక అవార్డు లభించింది. ఈ మూడు అవార్డులు తమ కృషికి ఓ ప్రత్యేక గుర్తింపునిచ్చాయని ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ అన్నారు.


Related Post