రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచే రెండు తెలుగు రాష్ట్రాల మద్య నదీ జలాల పంపిణీ విషయంలో ఘర్షణ పడుతున్నాయి. ఇరురాష్ట్రాలు తమ వైఖరే సరైనదని వాదిస్తూ ఏమాత్రం వెనక్కు తగ్గకపోవడం వలన ఈ సమస్య అపరిష్కృతంగా ఉండిపోయింది. ఈ సమస్యలపై చర్చించి పరిష్కారం కనుగొనేందుకు ఆగస్ట్ 5వ తేదీన ఇరువురు ముఖ్యమంత్రులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర జలవనరుల శాఖ భావించి లేఖలు వ్రాసింది. సిఎం కేసీఆర్ అధ్యక్షతన సాగునీటిశాఖ ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో గురువారం సమావేశం జరిగింది. దానిలో ఈ అంశంపై లోతుగా చర్చించారు.
ఈ సందర్భంగా వారు కొన్ని నిర్ణయాలు తీసుకొన్నారు. ఆగస్ట్ 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం సిద్దం కావలసి ఉన్నందున అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఆగస్ట్ 20 తరువాత ఎప్పుడైనా నిర్వహించాలని కోరుతూ కేంద్రానికి లేఖ వ్రాయాలని సిఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌కు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగిందని, ఇప్పుడు కూడా కృష్ణా, గోదావరీ జలాల విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ సహించవలసిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. కృష్ణా, గోదావరీ జలాలలో రాష్ట్రానికి రావలసిన వాతాలో ఒక్క బొట్టును కూడా వదులుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా లేదన్నారు. ఈ విషయంలో తెలంగాణ హక్కులను కాపాడుకొనేందుకు ట్రిబ్యూనల్స్ లో గట్టిగా పోరాడాలని నిర్ణయించారు. గోదావరి నదిపై రాష్ట్రంలో మొదలుపెట్టిన అన్ని సాగునీటి ప్రాజెక్టులకు ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆపకుండా మరింత వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. రెండు తెలుగు రాష్ట్రాల మద్య నెలకొన్న జలవివాదాలకు పరిష్కారం చూపడంలో కేంద్రప్రభుత్వం చాలా అలసత్వం ప్రదర్శిస్తోందని, ఈ విషయంలో కేంద్ర జలవనరుల శాఖ విఫలమైందని సమావేశంలో పాల్గొన్నవారు అభిప్రాయం వ్యక్తం చేశారు. జలవివాదాలను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకొంటున్నామని, కానీ వీలుకాకపోతే ట్రిబ్యూనల్ ద్వారా న్యాయబద్దంగా పరిష్కరించుకోవాలని కోరుకొంటున్నామని అన్నారు. ఎల్లకాలం ఈ సమస్య కొనసాగడం రెండు రాష్ట్రాలకు మంచిది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.