ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఆయనను మళ్ళీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి గవర్నర్ బిశ్వాభూషన్ హరిచందన్ పేరిట గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తుదితీర్పుకు లోబడి పదవి పునరుద్దరణ ఉంటుందని దానిలో పేర్కొంది.
టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్, కరోనా కారణంతో మార్చి 15న స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. అయితే ఆ విషయం ఆయన ముందుగా సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి కానీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి గానీ మాటమాత్రంగానైనా చెప్పలేదు. అప్పటికే కొంత ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో వైసీపీ అనేక జిల్లాలలో ఏకగ్రీవాలతో దూసుకుపోతోంది. మిగిలిన ప్రక్రియ పూర్తయి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ తప్పకుండా ఘనవిజయం సాధించి ఉండేది. ఇది జగన్ ప్రభుత్వానికి ఎంతో బలం చేకూర్చి ఉండేది. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేయడంతో వైసీపీ విజయానికి మోకాలు అడ్డినట్లయింది. అంతేగాక... వైసీపీ నేతల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని కనుక తనకు కేంద్ర రక్షణ దళాలతో భద్రత కల్పించాలని, ఏపీలో ఎక్కడ ఉన్నా తమకు భద్రత లేదని భావిస్తున్నందున హైదరాబాద్ నుంచి పనిచేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ కేంద్రానికి ఓ లేఖ కూడా వ్రాశారు.
తమ విజయాన్ని అడ్డుకోవడమే కాకుండా తమపై కేంద్రానికి ఫిర్యాదు చేసినందుకు ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆయనపై బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చంద్రబాబు కనుసన్నలలో పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆయనను పదవిలో తొలగిస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేసి ఆయన స్థానంలో జస్టిస్ కనకరాజ్‌ను ఏపీ ఎన్నికల కమీషనర్‌గా నియమించారు.
అప్పటి నుంచి ఆయనకు, ఏపీ ప్రభుత్వానికి మద్య హైకోర్టు, సుప్రీంకోర్టులో సుదీర్ఘమైన న్యాయపోరాటాలు జరిగాయి. కానీ అన్నీ నిమ్మగడ్డకే అనుకూలంగా వచ్చాయి. ఆయనను పునర్నియమించాలని గవర్నర్ ఆదేశించినా ఏపీ ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి మొట్టికాయలు వేయించుకొన్నాక ఇక విధిలేని పరిస్థితులలో మళ్ళీ ఆయనను ఏపీ ఎన్నికల కమీషనర్‌గా పునర్నియమించవలసి వచ్చింది. అయితే మళ్ళీ ఆయనకు, ప్రభుత్వానికి మద్య యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది కనుక మళ్ళీ మరో కొత్త కథ మొదలవవచ్చు.