రాష్ట్రంలో నానాటికీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కరోనా పరీక్షల కోసం ఆసుపత్రులకు, పరీక్షా కేంద్రాలకు వచ్చేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. కనుక ప్రజల వద్దకే వెళ్ళి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం 20 బస్సులలో అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన మొబైల్ కరోనా పరీక్షా కేంద్రాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంటలిజన్స్ మోనిటరింగ్ అనలైసిస్ సర్వీసస్ క్వారెంటైన్ (ఐఎంఏఎస్‌క్యూ)గా నామకరణం చేసిన ఈ మొబైల్ పరీక్షా కేంద్రాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బుదవారం ప్రారంభించారు.
వీటిలో మూడు రకాల వాహనాలున్నాయి.
మొదటిరకం: ఈ వాహనంలో కరోనా పరీక్షలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లతో పాటు అవసరమైన మందులు, వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యం కలిగిన నాలుగు పడకలు, ఐసోలేషన్ కోసం చిన్న గది కూడా ఉంటుంది. ప్రస్తుతం ఇటువంటిది ఒకే బస్సు ఉంది.
రెండోరకం: ఈ వాహనాలు కరోనా పరీక్షల కోసమే ప్రత్యేకంగా తయారుచేయబడ్డాయి. ఇటువంటివి మొత్తం 20 ఉన్నాయి. త్వరలో ఇటువంటి మరో 50 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ఒక్కో వాహనంలో ఒకేసారి 10 మందికి పరీక్షలు నిర్వహించవచ్చు. నగరంలో 10 కంటెయిన్మెంట్ జోన్లకు ఒక బస్సు చొప్పున కేటాయించారు. ముందుగా వీటిని హైదరాబాద్ నగరంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కంటెయిన్మెంట్ జోన్ల వద్దకు పంపించి అక్కడి ప్రజలకు కరోనా యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తారు. వాటితో వెంటనే ఫలితాలు వస్తాయి. ఈ వాహనాలలో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యి కరోనా లక్షణాలున్నవారిని వెంటనే అంబులెన్సులలో సమీపంలోని కరోనా ఆసుపత్రులకు తరలిస్తారు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ ఈ పరీక్షలలో నెగెటివ్ రిపోర్టు వచ్చినవారి రక్తనమూనాలను సేకరించి ప్రభుత్వం పరీక్షా కేంద్రాలకు పంపిస్తారు. అక్కడ వాటిని ఆర్టీ-పీసీఆర్ విధానంలో పరీక్షించి కరోనా ఉందా లేదా అనే విషయం నిర్ధారించుకొంటారు.
మూడో రకం: ఈ వాహనంలో వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యం కలిగి ఉంటాయి. వీటి ద్వారా కరోనా రోగులకు అత్యవసర చికిత్స అందించి వారిని ఆసుపత్రులకు తరలించేందుకు అంబులెన్సులుగా వినియోగిస్తారు. ఇటువంటివి మొత్తం 20 ఉన్నాయి.
వీటన్నిటి నిర్వహణ బాధ్యతను ‘వెరా స్మార్ట్ హెల్త్’ అనే సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. వీటిలో పనిచేసే డ్రైవర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ తదితరులకు అవసరమైన పీపీఈ కిట్లు, గ్లౌజులు, మాస్కూలు వగైరా ప్రభుత్వం ఇస్తుంది. ఈ 20 బస్సుల ద్వారా రోజుకి 60,000 పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. వీటిలో కరోనా పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.