కేసీఆర్‌, జగన్ సమావేశం... సాధ్యమేనా?

July 30, 2020


img

ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాల మద్య మళ్ళీ చక్కటి స్నేహపూరిత వాతావరణం ఏర్పడింది. ఇరువురు ముఖ్యమంత్రులు స్వయంగా పూనుకొని ఐదేళ్ళుగా అపరిష్కృతంగా ఉండిపోయిన అనేక విభజన సమస్యలను చిటికెలో పరిష్కరించారు. కానీ ఆ తరువాత వివిద అంశాల కారణంగా మళ్ళీ వారిరువురి మద్య దూరం పెరిగింది. 

ఏపీ ప్రభుత్వం రాయలసీమకు నీళ్ళు అందించేందుకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యం పెంచేందుకు పనుల కోసం జీవో జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం భగ్గుమంది. సిఎం కేసీఆర్‌ స్వయంగా దానిపై తీవ్ర అభ్యంతరం చెప్పడమే కాకుండా ఏపీ ప్రభుత్వంపై కృష్ణాబోర్డుకు పిర్యాదు చేయించారు కూడా. దాంతో ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వంపై అనేక పిర్యాదులు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు తీసుకోకుండా గోదావరినదిపై అనేక ప్రాజెక్టులు నిర్మించిందని ఇంకా నిర్మిస్తూనే ఉందని, వాటి వలన దిగువన ఉన్న ఏపీ చాలా నష్టపోతోందని ఫిర్యాదు చేసింది. ఈ గొడవలతో రెండు తెలుగు రాష్ట్రాల మద్య పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది.  

రెండు తెలుగు రాష్ట్రాల మద్య నెలకొన్న ఈ జల జగడాలను పరిష్కరించేందుకు ఆగస్ట్ 5వ తేదీన ఇరువురు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలనుకొంటున్నట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ బుదవారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఓ లేఖ వ్రాశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి మరియు ఆపెక్స్ కౌన్సిల్ ఛైర్మన్ గజేంద్రసింగ్ అధ్యక్షతన జరుగబోయే ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇరువురు ముఖ్యమంత్రులు అందుబాటులో ఉంటారో లేదో తెలియజేయాలని లేఖలో కోరారు. 

నదీ జలాల వినియోగం విషయంలో సిఎం కేసీఆర్‌కు పట్టుదల ఎక్కువ. అలాగే ఏదైనా తలుచుకొంటే ఏ మాత్రం వెనక్కు తగ్గని నైజాం జగన్‌ది. కనుక ఈవిషయంలో ఇద్దరూ పట్టువిడుపులకు అంగీకరించరు కనుక ఆపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనక పోవచ్చు. ఒకవేళ పాల్గొన్నా ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉండకపోవచ్చు.


Related Post