ఆగస్ట్ 5వ తేదీన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరుగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం సెక్యులర్ విధానానికి కట్టుబడి ఉంటానని ప్రమాణం చేసిన ప్రధాని నరేంద్రమోడీ హిందూమతానికి చెందిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం రాజ్యాంగ విరుద్దమని మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. రాజ్యాంగంలో పేర్కొన్నట్లు లౌకికతత్వానికి కట్టుబడి గౌరవించాలని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అయోధ్యలో 400 ఏళ్ళగా బాబ్రీ మసీదు ఉందని, డిసెంబర్ 1992లో ఓ క్రిమినల్ గుంపు దానిని ధ్వంసం చేశారని భావితరాలకు తాము చెపుతూనే ఉంటామని అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్‌లో చేశారు.
మన దేశంలో లౌకికవాదం ఒక అంతు తెలియని బ్రహ్మపదార్దంలా మారిందని చెప్పుకోవచ్చు. కనుక దానికి ఎవరికి నచ్చినట్లు వారు భాష్యం చెప్పుకొనే వెసులుబాటు ఏర్పడింది. లౌకికవాదానికి కట్టుబడి ఉండటమంటే పాలకులు గుళ్ళు, గోపురాలు, మసీదులు, చర్చిలకు వెళ్లకూడదని కాదు. పూజలు, యజ్ఞాలు చేయకూడదని కాదు. వివిద మత కార్యక్రమాలలో పాల్గొనకూడదని కాదు. కులమతలాకు అతీతంగా దేశప్రజలందరినీ సమానంగా చూస్తూ పాలన సాగించడమే లౌకికవాదానికి పరమార్ధం. కనుక అయోధ్య భూమిపూజలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొనడంపై అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ అది తప్పనుకొంటే తెలంగాణ సిఎం కేసీఆర్ కూడా నిత్యం గుళ్ళు గోపురాలు సందర్శిస్తూనే ఉంటారు. ఏటా యాగాలు నిర్వహిస్తూనే ఉంటారు కనుక అప్పుడూ అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం చెప్పి ఉండాలి. కానీ చెప్పరు. ఎందుకంటే మజ్లీస్, టిఆర్ఎస్ పార్టీల మద్య స్నేహం ఉంది.
అయోధ్యలో కాక మరెక్కడైనా ఇటువంటి కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నా బహుశః అసదుద్దీన్ ఓవైసీకి అభ్యంతరం ఉండక పోవచ్చు. కానీ అది అయోధ్యలో కనుకనే అభ్యంతరం చెపుతున్నారనుకోక తప్పదు.