హైకోర్టు ఆదేశాలను పాటిస్తాం: సిఎస్ సోమేష్ కుమార్‌

July 28, 2020


img

తెలంగాణలో కరోనా నివారణ చర్యలు, కరోనా చికిత్సకు చేసిన ఏర్పాట్లు, ఆసుపత్రులలో సౌకర్యాలు, పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్యల వివరాల వెల్లడి, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్ల కొరత తదితర అంశాలపై దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టులో జరిగిన విచారణలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఏమీ రమేశ్ రెడ్డి తాత్కాలిక సచివాలయం బీఆర్‌కె భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యి హైకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. 

హైకోర్టు సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కరోనాకు సంబందించి సమగ్ర సమాచారం ప్రతిరోజూ హెల్త్ బులెటిన్‌లలో ప్రకటిస్తోందని, ఇకపై మరింత సమాచారం హెల్త్ బులెటిన్‌లలో పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. హైకోర్టు సూచనల మేరకు ప్రింట్ అండ్ అలెక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రజలకు ఈ సమాచారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా హైకోర్టు వారికి పలు సూచనలు చేసింది. 

1. హెల్త్ బులెటిన్‌లలో ప్రతీరోజు కరోనాకు సంబందించి పూర్తి సమాచారం ఇవ్వాలి.

2. ఐసీఎంఆర్‌, ప్రపంచ ఆరోగ్యసంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలి. 

3. కరోనా సోకినవారి ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి కరోనా పరీక్షలు చేయాలి. 

4. కరోనా పరీక్షలను పెంచాలి. 

5. కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్యను దాచకుండా వెల్లడించాలి.

6.  ప్రస్తుతం కమ్యూనిటీ హాల్స్ ఖాళీగా ఉన్నందున వాటిలో పేదలకు క్వారెంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.  

7. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి, కరోనా రోగులనుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై ఏమి చర్యలు తీసుకొందో వివరించాలి. 

8. గతంలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం ఏ మేరకు పాటించిందో అఫిడవిట్‌ ద్వారా తెలియజేయాలి. 

9.  హైకోర్టు తాజా ఆదేశాల అమలుకు రెండు వారాల గడువు. 

10. ఈ కేసుల తదుపరి విచారణను ఆగస్ట్ 13కి వాయిదా వేసింది. 


Related Post