కూల్చివేతకు అందమైన పేరు!

July 28, 2020


img

హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న తెలంగాణ సచివాలయం కూల్చివేసి దాని స్థానంలో ఆధునాతనమైన సచివాలయం నిర్మించాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రజలలో కూడా భిన్నాభిప్రాయాలున్నాయనేది వాస్తవం. దశాబ్ధాలుగా ఎందరో ముఖ్యమంత్రులు, మంత్రులు ఉపయోగించుకొన్న వందలకోట్లు విలువచేసే సచివాలయ భవనాలను వాస్తు కోసం కూల్చివేయడాన్ని హర్షించేవారెందరో ప్రభుత్వానికే తెలియాలి. ముఖ్యంగా ఈ కరోనా విపత్కాలంలో ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేసి పాతది కూల్చుకొని కొత్తది కట్టుకోవాలనే ప్రతిపాదనను చాలామంది ప్రజలు హర్షించలేకపోతున్నారు. శిధిలావస్థకు చేరుకొన్న ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి కొత్తది కట్టేందుకు ప్రభుత్వం సిద్దం అయితే ప్రజలందరూ మనస్ఫూర్తిగా స్వాగతించేవారు. కానీ మరో రెండుమూడు దశాబ్ధాలపాటు ధృడంగా నిలువగల సచివాలయాన్ని కూల్చివేయడాన్ని హర్షించలేకపోతున్నారు. 

ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాలు నిర్మించాలంటే ఆసుపత్రిని తక్షణమే ఖాళీ చేయవలసి ఉంటుంది కనుక, దానిని తాత్కాలికంగా సచివాలయ భవనాలలోకి తరలించి వాడుకోవచ్చు. లేదా కరోనా రోగులకు క్వారెంటైన్‌ కేంద్రంగా లేదా ఆసుపత్రిగా వినియోగించుకోవచ్చు. కానీ అటువంటి ఆలోచనలేవీ చేయకుండా హడావుడిగా రేయింబవళ్లు పనిచేస్తూ సచివాలయం కూల్చివేస్తుండటాన్ని చాలా మంది ప్రజలు అంగీకరించలేకపోతున్నారు. 

హైకోర్టు ఒత్తిడి చేస్తుండటంతో సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధులను సచివాలయం కూల్చివేత పనులు చిత్రీకరించడానికి ప్రభుత్వం అనుమతించింది. ఉద్యోగులు, అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు వారిని కలిసేందుకు వచ్చే ప్రజలు, మీడియాతో కళకళలాడిన  సచివాలయం ఇప్పుడు శిధిలాల కుప్పలుగా మారిపోవడం చూసి ఎవరికైనా మనసు బాధ కలగకమానదు. అయితే ఆ శిధిలాల కుప్పలకు “వలస పాలన ప్రతీక పతనం” అంటూ ఓ అందమైన పేరుతో కూల్చివేత పనుల గురించి ఓ వార్తను ప్రచురించింది ఓ ప్రముఖ తెలంగాణ పత్రిక.

సచివాలయం వలస పాలనకు ప్రతీక అయితే మన శాసనసభ, మండలి భవనాలు, రాజ్‌భవన్‌, అనేకానేక ప్రభుత్వ కార్యాలయాలు, పార్లమెంటు, రాష్ట్రపతి భవనం, చివరికి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలను కూడా కూల్చివేసుకోవలసి ఉంటుంది. అది సాధ్యమేనా? అని ఆలోచిస్తే ఇది ఎంత వితండ వాదనో అర్ధం అవుతుంది. అంటే సచివాలయం కూల్చివేయడానికి ప్రభుత్వం హైకోర్టుకు చెప్పిన కారణాలు వేరు వాస్తవాలు వేరని అర్ధమవుతోంది. 

ఏది ఏమైనపటికీ, సచివాలయం కూలిపోయింది కనుక ఇక దాని గురించి ఆలోచించడం...బాధపడటం అనవసరం. పైగా సచివాలయం కూల్చివేసుకొన్నందున ఇప్పుడు అత్యవసరంగా శాశ్విత సచివాలయం నిర్మించుకోక తప్పదు. కొత్త సచివాలయం నిర్మాణం పూర్తయితే పాత సచివాలయం జ్ఞాపకాలు ఎలాగూ చరిత్ర పుటలలోకి వెళ్ళిపోతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట ఇనుమడించే విధంగా కొత్త సచివాలయం నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతోంది కనుక దాని కోసం ఎదురుచూడవలసిందే.


Related Post