గాల్వాన్ లోయలో చైనా సైనికులు 22 మంది భారత్ జవాన్లను అతికిరాతకంగా హత్య చేసినందుకు భారత్ ప్రభుత్వం దౌత్యపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయినా చైనాపై మరో విధంగా ప్రతీకారం తీర్చుకొంటోంది. ఆ దురదృష్టకర ఘటన జరిగినప్పటి నుంచి చైనాకు చెందిన 59 మొబైల్ యాప్‌లను భారత్ నిషేదించింది. వివిద రంగాలలో పెట్టుబడులు, పనుల కోసం చైనా సంస్థలతో గతంలో చేసుకొన్న ఒప్పందాలను వరుసగా రద్దు చేసుకొంటూ షాక్ ఇస్తోంది. తాజాగా చైనాకు చెందిన మరో 47 మొబైల్ యాప్‌లను నిషేధించింది.
కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్, షేర్ ఇట్ వంటి కొన్ని చైనా యాప్‌లను నిషేదించడంతో ఆ సంస్థలు వాటి పేర్లు కొద్దిగా మార్చి టిక్ టాక్ లైట్, షేర్ ఇట్ లైట్ అనే కొత్తపేర్లతో మళ్ళీ భారత్‌లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏమార్చాలనే వాటి ప్రయత్నాలను గుర్తించిన కేంద్రప్రభుత్వం అటువంటి 47 డూప్లికేట్ లేదా క్లోనింగ్ మొబైల్ యాప్‌లను నిషేదిస్తున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మొత్తం 106 చైనా మొబైల్ యాప్‌లను నిషేదించినట్లయింది. త్వరలోనే మరో 258 చైనా మొబైల్ యాప్‌లను నిషేదించబోతున్నట్లు సమాచారం.
భారతీయ చట్టాల ప్రకారం వ్యక్తిగత సమాచారం దొంగిలించడం, దానిని ఇతర సంస్థలు, దేశాలకు అందించడం నేరం. కనుక ఆ మొబైల్ యాప్స్ అందిస్తున్న చైనా సంస్థలు భారత్‌లోనే కార్యాలయాలు తెరిచి తమ వినియోగదారులకు సేవలు అందించే సాకుతో వారి వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నాయి. ఒకసారి ఆ సంస్థల చేతికి భారతీయుల వ్యక్తిగత వివరాలు అందితే వాటిని చైనా ప్రభుత్వానికి చేరవేయడం పెద్ద కష్టమేమీ కాదు.
ప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్నంతా చైనా సంస్థల చేతిలో పెడుతున్నారని, అది ఎప్పటికైనా చాలా ప్రమాదమేనని భారత్ నిఘా సంస్థలు పదేపదే హెచ్చరిస్తూనే ఉన్నాయి. కనుక వాటికి అడ్డుకట్ట వేయాలని సూచిస్తూనే ఉన్నాయి. కానీ ఇంతకాలం కేంద్రప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే టిక్ టాక్ మోజులో పడి దేశప్రజలు తమ వ్యక్తిగత సమాచారాన్నంతా చైనా సంస్థల చేతిలో పెడుతూనే ఉన్నారు. భారత్-చైనా ఘర్షణలతో కేంద్రప్రభుత్వంలో కదలిక వచ్చి వరుసగా యాప్‌లను నిషేదిస్తోంది. దేశ ప్రజలు కూడా చైనా యాప్‌లకు, వస్తువులకు, ముఖ్యంగా చైనా ఇప్పుడు భారత్‌లో తయారవుతున్న చైనా మొబైల్ ఫోన్లను కూడా కొనకుండా స్వదేశీ ఉత్పత్తులను కొన్నప్పుడే చనిపోయిన వీరజవాన్లకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది.