ఈ నెలాఖరుతో దేశంలో అన్‌లాక్-2 పూర్తయ్యి ఆగస్ట్ 1 నుంచి అన్‌లాక్-3 మొదలవుతుంది. అన్‌లాక్-1,2లో వివిద రంగాలపై లాక్‌డౌన్ ఆంక్షలను సడలించిన కేంద్రప్రభుత్వం ఈసారి సినిమా ధియేటర్లు, మరికొన్ని రంగాలపై ఆంక్షలు సడలించడానికి సిద్దం అవుతోంది.
ఆగస్ట్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లను తెరిచేందుకు అనుమతించాలని అనుకొంటోంది. కానీ థియేటర్ల సీటింగ్ కెపాసిటీలో కేవలం 25శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని కేంద్రం భావిస్తుండగా, థియేటర్ల యజమానులు కనీసం 50 శాతం అనుమతించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. 25 శాతం ఆక్యుపెన్సీతో ధియేటర్లను నడిపించడం సాధ్యం కాదని అంతకంటే మూసుకోవడమే మంచిదని భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వం, థియేటర్ల యాజమానుల సంఘాల మద్య ఈ అంశంపై చర్చలు నడుస్తున్నాయి. అవి ఫలిస్తే ఆగస్ట్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు తెరుచుకొనే అవకాశం ఉంది.
అన్‌లాక్-3లో వ్యాయామశాలలపై ఆంక్షలు కూడా ఎత్తివేయాలని కేంద్రం యోచిస్తోంది. ఆగస్ట్ నెలాఖరు వరకు మెట్రో రైళ్ళపై ఆంక్షలు కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యాసంస్థల విషయంలో కేంద్రం కూడా ఇంకా సందిగ్దంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో రోజురోజుకీ కరోనా వైరస్ విస్తరిస్తున్నందున తల్లితండ్రులు తమ పిల్లలను పాఠశాలలు, కాలేజీలకు పంపేందుకు ఇష్టపడటం లేదు. కనుక విద్యాసంస్థలపై ఆంక్షల సడలించి తిరిగి వాటిని ఏవిధంగా నడిపించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వాలే ఆలోచించుకొని నిర్ణయం తీసుకొనేందుకు అనుమతించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్‌లాక్-3 అమలు, మార్గదర్శకాల గురించి రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చిస్తోంది. ఒకటి రెండు రోజుల అన్‌లాక్-3 అమలు, మార్గదర్శకాలు ప్రకటించే అవకాశం ఉంది.