భారత్‌లో కరోనా రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రతీరోజు సుమారు 48,000 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటలలో 48,916 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 13,36,861కి చేరింది. అంటే ప్రతీ రెండు రోజులకు దేశంలో లక్ష పాజిటివ్ కేసులు చొప్పున పెరుగుతున్నాయన్న మాట!
ప్రస్తుతం 4,56,071 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా, నేటి వరకు 8,49, 432 మంది కోలుకొన్నారని కేంద్ర కుటుంబఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా సోకినప్పటికీ వారిలో 63 శాతం మంది కోలుకొంటుండటం చాలా ఊరటనిస్తోంది.
భారత్‌లో కరోనా మరణాల రేటు తగ్గిందని కేంద్ర కుటుంబఆరోగ్యశాఖ చెపుతోంది కానీ దేశంలో కరోనా మరణాలు ఆగడం లేదు. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 757 మంది చనిపోయారు. దేశంలో కరోనా మహమ్మారి అడుగుపెట్టినప్పటి నుంచి నేటి వరకు మొత్తం 31,358 మందిని బలి తీసుకొంది.
పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉన్నా ఇంకా ‘కరోనా సామాజికవ్యాప్తి దశకు చేరుకోలేదని’ ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తుండటం చాలా శోచనీయం. ఇప్పుడు కరోనా సోకి ఆసుపత్రిలో చేరక తప్పని పరిస్థితి ఏర్పడితే అంతకంటే నరకం మరొకటి ఉండదు. ఎందుకంటే, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో వందల సంఖ్యలో బెడ్లు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వాలు చెపుతున్నప్పటికీ కరోనా రోగులను చేర్చుకోవడం లేదు. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే ఉన్న ఆస్తులు అమ్ముకోవలసిందే అని ప్రభుత్వ వైద్యాధికారులే చెపుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దేశంలో కరోనా మహమ్మారి కు వ్యాక్సిన్ వచ్చేవరకు ఈ సంక్షోభం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టమైంది కనుక అంతవరకు కరోనా సోకకుండా ప్రజలు ఎవరి జాగ్రత్తతో వారు ఉండటం చాలా అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.