అమెరికాలో నలుగురు చైనీయులు అరెస్ట్!

July 25, 2020


img

అమెరికా-చైనా మద్య మొదలైన దౌత్యయుద్ధం నిన్న కొత్త మలుపు తీసుకొంది. శాన్‌ఫ్రాన్సిస్కోలో జువాన్ టాంగ్ అనే మహిళను యూఎస్ మార్షల్స్ అరెస్ట్ చేశారు. ఆమె గతంలో చైనా సైన్యంలో పనిచేసిందనే విషయాన్ని దాచిపెట్టి వీసా పొంది అమెరికాకు వచ్చారనే ఆరోపణతో ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. 37 ఏళ్ళు వయసున్న జువాన్ టాంగ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, డేవిస్‌లో రేడియేషన్ అంకాలజీలో విజిటింగ్ ప్రొఫెసరుగా చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి నార్త్ కాలిఫోర్నియా జైలుకు తరలించారు. సోమవారం ఆమెను ఫెడరల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. 

గత నెల 20వ తేదీన ఆమెను విచారించినప్పుడు తాను గతంలో చైనా సైన్యంలో పనిచేసినట్లు చెప్పకుండా దాచిపెట్టిందని ఎఫ్‌బీఐ ఆరోపించింది. తాము ప్రశ్నించిన మరునాడే ఆమె శాన్‌ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్‌ కార్యాలయంలో ఆశ్రయం కోసం ప్రయత్నించారని ఎఫ్‌బీఐ ఆరోపించింది. గత అక్టోబరులో అమెరికా వచ్చిన ఆమె శాన్‌ఫ్రాన్సిస్కోలోని చైనా కాన్సులేట్‌ కార్యాలయం కోసం అమెరికాలో గూడచర్యానికి పాల్పడుతున్నట్లు ఎఫ్‌బీఐ అనుమానిస్తోంది. అంతకు ముందు చైనాకు చెందిన మరో ముగ్గురు సైంటిస్టులను కూడా యూఎస్ మార్షల్స్ అరెస్ట్ చేశారు. ఒకవేళ నేరనిరూపణ అయితే అమెరికా చట్టాల ప్రకారం వారికి కనీసం 10 ఏళ్ళు జైలుశిక్ష పడవచ్చు. దాంతోపాటు సుమారు రూ.1.88 కోట్లు జరిమానా కూడా చెల్లించవలసి ఉంటుంది. 

అమెరికాలో గూడచర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణతో హ్యూస్టన్ నగరంలోని చైనా కాన్సులేట్‌ను  ట్రంప్‌ ప్రభుత్వం మూసివేయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నలుగురు చైనా దేశస్థులను అరెస్ట్ చేయడం, వారిలో ఒకరు చైనా కాన్సులేట్‌ కార్యాలయంలో ఆశ్రయం పొందడంతో చైనాపై అమెరికా చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. 

అయితే చైనా కూడా అమెరికాపై సరిగ్గా ఇటువంటి ఆరోపణలే చేస్తూ వాంగ్డూ నగరంలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయాన్ని మూసివేయించింది. కనుక ఇప్పుడు చైనా కూడా అక్కడి అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని గూడచర్యం ఆరోపణలతో అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదు. అదే కనుక జరిగితే, ఇక అమెరికా-చైనా దేశాల మద్య దౌత్యయుద్ధం మరింత తీవ్రమవడం తధ్యం.


Related Post