ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మళ్ళీ ఎదురుదెబ్బ

July 24, 2020


img

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ తొలగింపు విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మళ్ళీ ఎదురుదెబ్బ తగలింది. దాంతోపాటు ఈసారి మొట్టికాయలు కూడా పడ్డాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దానిపై నేడు విచారణ చేపట్టినప్పుడు ఏపీ ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం గురించి తమకు పూర్తిగా తెలుసునని అందుకే స్టే ఇవ్వడం లేదని, ఇకనైనా ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును గౌరవించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను పాటించకపోతే కోర్టు ధిక్కారణ క్రిందే వస్తుందని గుర్తుంచుకోవాలని జస్టిస్ బొబ్డే ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను బలవంతంగా పదవిలో నుంచి తొలగించినందుకు ఆయన హైకోర్టును ఆశ్రయించగా, ఆయనను తొలగించే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని వెంటనే ఆయనకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళగా సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పునే సమర్ధించింది. అయినప్పటికీ నిమ్మగడ్డకు బాధ్యతలు అప్పగించకపోవడంతో ఆయన మళ్ళీ హైకోర్టుకు వెళ్లారు. 

ఏపీ ప్రభుత్వంపై ఆయన కోర్టు ధిక్కారం కేసు వేశారు. దానిపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళగా దానినీ సుప్రీంకోర్టు తిరస్కరించింది. దాంతో మళ్ళీ ఈ కధ హైకోర్టుకు చేరింది. హైకోర్టు సూచన మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను కలిసి హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు, ఆదేశాలను తెలియజేసి తనకు తన పదవి ఇప్పించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరారు. దాంతో ఆయన హైకోర్టు సూచించిన విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించాలని ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ వ్రాశారు. 

ఈ వ్యవహారంలో వరుసగా ఇన్నిసార్లు ఎదురుదెబ్బలు తింటున్న ఏపీ ప్రభుత్వం మళ్ళీ స్టే కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. దానినీ మళ్ళీ తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. 

హైకోర్టు, సుప్రీంకోర్టు, గవర్నర్‌ మూడు అత్యున్నతమైన రాజ్యాంగ వ్యవస్థలలో తప్పు పడుతూనే ఉన్నా ఏపీ ప్రభుత్వం పంతానికిపోయి కోర్టుల చుట్టూ తిరుగుతూ మొట్టికాయలు వేయించుకొంటోంది తప్ప ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటికైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు కుర్చీ అప్పగిస్తుందో లేదో చూడాలి.     



Related Post