భారతీయ రైల్వే మరో కొత్త ప్రయోగం

July 24, 2020


img

లాక్‌డౌన్‌... కరోనా భయంతో నష్టపోతున్న అనేక సంస్థలలో భారతీయ రైల్వేలు కూడా ఒకటి. కరోనాకు ముందు దేశవ్యాప్తంగా ప్రతీరోజు వేలాదిరైళ్ళలో లక్షలాదిమందిని వారి గమ్యస్థానాలకు చేర్చుతుండేవి. లాక్‌డౌన్‌ పుణ్యమాని గత నాలుగు నెలలుగా అన్ని నిలిచిపోయాయి. దాంతో రైల్వేలకు ప్రతీరోజు కోట్లరూపాయలు నష్టం కలుగుతోంది. ప్రస్తుతం 230 ప్రత్యేక రైళ్ళు మాత్రమే తిరుగుతున్నాయి. కానీ లాక్‌డౌన్‌ సమయంలో కూడా గూడ్సు రైళ్ళు సరుకు రవాణా చేస్తున్నందున రైల్వేశాఖ కుప్పకూలిపోకుండా నిలిచి ఉంది. 

నేటికీ దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి తప్ప తగ్గే సూచనలు కనపడటం లేదు కనుక ప్యాసింజర్ రైళ్ళు ఇంకా ఎప్పుడు పట్టాలెక్కుతాయో తెలీని పరిస్థితులు నెలకొన్నాయి. కనుక దక్షిణమద్య రైల్వే తన ఆదాయం పెంచుకోవడానికి రైల్వే కార్గో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి న్యూఢిల్లీ వరకు ఓ కార్గో ఎక్స్‌ప్రెస్‌ను ప్రయోగాత్మకంగా నడిపించబోతున్నారు. 

సాధారణ వ్యాపారస్తులు, రైతులు ఎవరైనా తమ సరుకులు లేదా ఆహార ఉత్పత్తులను కార్గో ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి రవాణా చేసుకోవచ్చు. ఒక టన్నుకు రూ.2,500 రవాణా ఛార్జీగా నిర్ణయించినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న ఛార్జీల కంటే ఇది 40 శాతం తక్కువని తెలిపారు. సరుకు, పరిమాణం బట్టి రవాణా ఛార్జీలు మారుతాయని తెలిపారు.  

దీని బిజినెస్ డెవలప్మెంట్ కోసం దక్షిణమధ్య రైల్వేశాఖ ట్విట్టర్‌లో Vijayawada_RailFreight @Bzarailfreight పేరుతో ఓ ఖాతాను కూడా తెరిచింది. వినియోగదారులు దాని ద్వారా ఆన్‌లైన్‌లో కార్గో ఎక్స్‌ప్రెస్‌లో బుకింగ్స్ సంబందించి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా దక్షిణమధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. అతితక్కువ ఛార్జీలతో ఎటువంటి సరుకులనైనా భద్రంగా గమ్యస్థానానికి చేర్చడమే తమ లక్ష్యమని సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజరు అన్నారు.


Related Post