కరోనాతో అమెరికాను దారుణంగా దెబ్బ తీస్తున్నందుకు ప్రతీకారంగా హ్యూస్టన్ నగరంలోని చైనా దౌత్యకార్యాలయాన్ని మూయించివేసింది ట్రంప్ సర్కార్. చైనా కూడా ధీటుగా బదులిస్తున్నట్లు చెంగ్డూ నగరంలోని అమెరికా దౌత్యకార్యాలయం మూసివేయాలని ఆదేశించింది.
అంతర్జాతీయ చట్టలకు విరుద్దంగా అమెరికా ఏకపక్షంగా తీసుకొన్న నిర్ణయానికి బదులుగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. అమెరికా తీరు ఏమాత్రం సమర్ధనీయంగా లేదని, ఇదేవిధంగా వ్యవహరిస్తున్నట్లయితే అమెరికా-చైనా సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అమెరికా కవ్వింపు ధోరణితో సమస్యలు సృష్టిస్తోందని చెప్పింది. ఇకనైనా అమెరికా తన తప్పును సరిదిద్దుకొని హ్యూస్టన్‌లోని చైనా దౌత్యకార్యాలయాన్ని అనుమతించాలని చైనా విదేశాంగ శాఖ కోరింది.
అమెరికా-చైనాల కీచులాటలు అవి ఎదుర్కొంటున్న సమస్యలపై నుంచి తమ ప్రజల, ప్రపంచదేశాలను దృష్టిని మళ్ళించేందుకే..అని చెప్పేందుకు బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. కరోనాను అంటగట్టినందుకు ప్రపంచదేశాలు చైనాను దోషిగా చూస్తున్నాయి. ఆ కారణంగా వివిద దేశాల ప్రత్యక్షంగానో పరోక్షంగానో చైనాపై చర్యలు తీసుకొంటూనే ఉన్నాయి. వాటి వలన చైనా రాజకీయంగా, వాణిజ్యపరంగా, ఆర్ధికంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. కనుక ప్రపంచదేశాల దృష్టిని మళ్ళించాలంటే ఏదో ఓ పెద్ద డ్రామా ఆడకతప్పదు. భారత్, అమెరికాలతో ఘర్షణలను ఆ డ్రామాలో భాగంగానే భావించవచ్చు. కానీ ఈ డ్రామాలతో చైనా ప్రపంచదేశాల దృష్టిలో ఇంకా దిగజారిపోయింది. అందరిచేత ఓ దూర్తదేశంగా ముద్ర వేయించుకొంటోంది.
ఇక ట్రంప్ సర్కార్ చైనాపై ఎందుకు విరుచుకుపడుతున్నారో అందరికీ తెలుసు. ఒకటి కరోతో అమెరికాకు జరుగుతున్న ప్రాణనష్టం..ఆర్ధిక సంక్షోభం వగైరా కాగా రెండోది అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ఆ ఎన్నికలలో ట్రంప్ మళ్ళీ గెలవాలంటే ఈ కరోనా సమస్యలన్నిటికీ మూలకారణం చైనాయేనని బలంగా నమ్మేలా చేయాలి. అమెరికన్లలో సెంటిమెంటు రగిలించాలి. అందుకే ఈ కీచులాటలు. ఓ పక్క చైనాతో కీచులాడుతూనే మరోపక్క ‘కరోనా వ్యాక్సిన్ తయారీలో చైనాతో కలిసి పనిచేయడానికి అమెరికా సిద్దం’ అని ట్రంప్ చెప్పడం గమనిస్తే, ఆయన మాటలకు చేతలకు ఎక్కడా పొంతన లేదని అర్ధమవుతుంది. కనుక ఆయన తాపత్రయం అంతా అధ్యక్ష ఎన్నికల కోసమేనని భావించవచ్చు.