మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు!

July 24, 2020


img

తెలంగాణ రాష్ట్ర మునిసిపల్, ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి మరియు తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజల తరపున ఆయనకు మైతెలంగాణ.కామ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. 

కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా టిఆర్ఎస్‌ నేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లా జిల్లా గత ఆరేళ్ళలో ఏవిధంగా అభివృద్ధి చేశారో తెలియజేస్తూ టిఆర్ఎస్‌ నేత ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. దానిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, కర్నె ప్రభాకర్ తదితరులు ఈరోజు తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. 

తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో కేటీఆర్‌ పాత్ర గురించి అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి వివిద పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు, వాణిజ్య సంస్థలను రప్పించింది ఎవరంటే కేటీఆర్‌ అని చెప్పక తప్పదు. అందుకోసం వ్యవస్థలను, విధానాలను ప్రక్షాళన చేసి, వాటిలో అభివృద్ధికి ‘స్పీడ్ బ్రేకర్ల’ను గుర్తించి తొలగించడంతో తన మహాయజ్ఞo ప్రారంభించారు. ఆ తరువాత నూతన ఐ‌టి, పారిశ్రామిక విధానాలను రూపొందించి అమలుచేయడం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐటీ-హబ్‌లు, ఐ‌టి పార్కులు, ఐ‌టి టవర్లు, టెక్స్‌టైల్‌ పార్కులు, వివిద రకాల పారిశ్రామికవాడలు ఏర్పాటు చేయించారు. దేశవిదేశాలలో తిరిగి అనేక పెద్ద పెద్ద సంస్థలతో మాట్లాడి రాష్ట్రానికి రప్పించి రాష్ట్రాభివృద్ధికి శ్రీకారం చుట్టారు.   

మునిసిపల్ మంత్రిగా కేటీఆర్‌ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మౌలికవసతులు కల్పనకు పెద్దపీట వేశారు. రాష్ట్రంలో అన్ని నగరాలు, పట్టణాలలో చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నారు. ప్రతీ నగరం, పట్టణంలో రోడ్లు, డ్రెయినేజీలతో సహా సుందరీకరణపనులు కూడా చేయిస్తూ వాటి రూపురేఖలనే మార్చివేయిస్తున్నారు. 

ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అనేక ఫ్లై ఓవర్ల నిర్మాణం, పాత డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించడం వంటివి అనేక పనులను నిరంతరం ఓ యజ్ఞoలా చేస్తున్నారు. 

అదేసమయంలో తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పార్టీని ఎంతో సమర్ధంగా నిర్వహిస్తున్నారు కేటీఆర్‌. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి తెలంగాణలో టిఆర్ఎస్‌ను ఓ తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు. అటు ప్రభుత్వంలోను ఇటు పార్టీలోను తిరుగులేని నాయకుడిగా ఎదిగినప్పటికీ ఏమాత్రం అహంకారం ప్రదర్శించకుండా అందరితో స్నేహంగా గౌరవంగా ఉంటూ అందరి మన్ననలు అందుకొంటున్నారు. విద్య, వినయం, సమర్ధత, నిబద్దత, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే తపన, ప్రజల సమస్యలు, కష్టాలను తీర్చే మానవీయత వంటి సకల సుగుణాలు కలబోసిన తారకరాముడికి ప్రజలందరి తరపున మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది మైతెలంగాణ.కామ్.


Related Post