దేశంలోకి కరోనా మహమ్మారి ప్రవేశించిన కొత్తలో అన్ని రాష్ట్రాలు చాలా చురుకుగా స్పందిస్తూ కరోనా పరీక్షలు నిర్వహించి రోగులను ఆసుపత్రులకు తరలించేవి. కానీ చాలామందికి అప్పటికి కరోనా గురించి పూర్తి అవగాహన లేనందున ఇళ్ళలో దాక్కోనేవారు లేదా తమ కోసం వచ్చే ఆరోగ్యకార్యకర్తలు, వైద్యులు, పోలీసులపై రాళ్ళు రువ్వడం, ఉమ్మివేయడం చేస్తూ చాలా అనుచితంగా వ్యవహరించేవారు. ఆసుపత్రులలో చేరిన తరువాత కూడా చాలా మంది వైద్యులు, వైద్య సిబ్బందితో చాలా అనుచితంగా ప్రవర్తించేవారు. ప్రభుత్వాలు, పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు కలిసి తమను వేధిస్తున్నారని భావించేవారే తప్ప ప్రభుత్వాలు అందిస్తున్న ఉచితవైద్య సేవల విలువను చాలామంది గుర్తించలేకపోయారు.
అప్పుడు చాలా పరిమిత సంఖ్యలో రోగులు ఉండేవారు కనుకనే ప్రభుత్వాలు అంత ఉదారంగా కరోనా రోగులకు చికిత్స అందించేవి. కానీ ఇప్పుడు రోజుకు వేలమంది కరోనా బారిన పడుతుండటంతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా ఎవరికి పడితే వారికి బెడ్లు ఇవ్వడం లేదు. ఇక కరోనా పరీక్షలు, చికిత్సలకు ప్రైవేట్ ఆసుపత్రులను అనుమతించి, ఛార్జీలు కూడా ప్రకటించడంతో ప్రైవేట్ ఆసుపత్రులు జోరుగా కరోనా వ్యాపారం మొదలుపెట్టేశాయి. చేతిలో కనీసం 3-4 లక్షలు పట్టుకొని వెళ్తే తప్ప ఆసుపత్రులలో చేర్చుకోవడం లేదు. చేర్చుకొన్న తరువాత కూడా ప్రభుత్వం ప్రకటించిన ఛార్జీలకు మూడు నాలుగు రేట్లు వసూలు చేస్తూ అందినకాడికి దోచుకొంటున్నాయి. కరోనాతో ప్రాణాలు పోతే కుటుంబం రోడ్డున పడుతుందనే భయంతో అప్పోసొప్పో చేసి ఫీజులు చెల్లించేవారు కొందరైతే, పిల్లల చదువులకో, పెళ్లిళ్ల కోసమో చిరకాలం కష్టపడి దాచుకొన్న డబ్బును ప్రైవేట్ ఆసుపత్రులకు సమర్పించుకొంటున్నారు మరికొందరు.
ఇటువంటి పరిస్థితులు దాపురిస్తాయని మైతెలంగాణ.కామ్ మూడు నాలుగు నెలల క్రితమే ఊహించి చెప్పింది. ఇప్పుడు అదే నిజమవుతోంది. నిజం చెప్పాలంటే ఆనాడు ఊహించిన దానికంటే కూడా ఇంకా దారుణమైన పరిస్థితులు సర్వత్రా నెలకొన్నాయిప్పుడు.
సాధారణ దగ్గు, జలుబు, జ్వరం వస్తే కరోనా వచ్చిందేమోనని భయపడే పరిస్థితులు వచ్చాయి. దగ్గితే అందరూ కరోనా రోగేమో అన్నట్లు అనుమానంగా చూస్తున్నారు. రోడ్డుపై ఎవరైనా పడిపోతే పట్టించుకొనే నాధుడు ఉండడు. ఏ గుండెపోటుతోనో చనిపోతే కుటుంబ సభ్యులు సైతం శవాన్ని విడిచిపెట్టి పారిపోతున్నారు. కరోనా మహమ్మారి మనుషులనే కాదు మానవత్వాన్ని కూడా చంపేస్తోంది.
ఇక లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడినవారు కోట్లమంది ఉన్నారు. ఇప్పుడు కరోనా భయంతో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోలేక బాధలు పడుతున్నవారు కూడా ఉన్నారు. పిల్లలు స్కూళ్లకు వెళ్లలేరు. చదువుకోలేరు. దాంతో ఉపాధ్యాయులు కూడా రోడ్డున పడ్డారు. సినిమాలు లేవు... షూటింగులు లేవు...సినిమా హల్స్ లేవు... కనుక సినీపరిశ్రమలో పనిచేసే వేలాదిమందికి పనులులేవు. వారు రోడ్డున పడ్డారు.
కరోనా ఒక రోగమే కాదు..అన్ని రంగాలను కబళించివేస్తున్న ఓ మహమ్మారి. వ్యాక్సిన్ వస్తే తప్ప కరోనాను... సమాజంపై దాని ప్రభావాన్ని కట్టడి చేయడం సాధ్యం కాదు. కానీ ఆలోపుగా ఈ మహమ్మారి ఇంకా ఎంతమందిని బలి తీసుకొంటుందో...ఇంకా ఎన్ని అనర్ధాలు జరుగుతాయో?