భారత్‌లో రోజుకు 45,000 కొత్త కేసులు!

July 23, 2020


img

భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు రోజుకు 45,000కు పైగా కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రతీ రెండు రోజులకు దేశంలో సుమారు లక్ష కేసులు చొప్పున పెరిగిపోతున్నాయి. దీంతో ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న దేశంగా భారత్‌ నిలువబోతోంది. భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. ఇదేవేగంతో ప్రతీరోజు కొత్తకేసులు నమోదవుతున్నట్లయితే ఈ ఏడాది చివరిలోగా కనీసం కోటిమందికి పైగా కరోనా సోకే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,129 మంది చనిపోయారు. దాంతో దేశంలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య 30,000కి చేరింది. 

ఈ సమస్యకు ఏకైక పరిష్కారం కరోనా వ్యాక్సిన్ మాత్రమే. భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన ‘కోవాక్సిన్‌’ క్లినికల్ ట్రయల్స్‌ వారం రోజుల క్రితమే మొదలయ్యాయి. అవి పూర్తయ్యి, అనుమతులు తీసుకొని ఉత్పత్తి ప్రారంభించేసరికి మరో మూడు నెలలు పట్టవచ్చు. అమెరికాలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ను మొదటిదశ క్లినికల్ ట్రయల్స్‌ విజయవంతం అవడంతో అందరూ దాని కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ వ్యాక్సిన్‌ వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయడానికి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో భారత్‌కు చెందిన పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ఒప్పందం చేసుకొంది. ఆ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్‌ అన్ని విజయవంతమైతే, ఈ ఏడాది డిసెంబర్‌లోగా 30 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసి దేశానికి అందిస్తామని ఆ సంస్థ అధినేత ఆధర్ పూనావాలా తెలిపారు. కనుక ఈ రెండు వ్యాక్సిన్లలో ఏదో ఒకటి లేదా రెండూ ఈ ఏడాది డిసెంబర్‌లోగా ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. కనుక అంతవరకు అందరూ కరోనా సోకకుండా జాగ్రత్తపడక తప్పదు.


Related Post