తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జోరుగా కూల్చివేత పనులు సాగుతున్నాయి. ఇక ఈ సమయంలో దానిపై కొత్తగా పిటిషన్ వేయడానికి ఏముంటుంది? అనుకోవచ్చు కానీ ఉందని వాదిస్తున్నాయి వి6 న్యూస్ ఛానల్, వెలుగు పత్రికలు.
సచివాలయం కూల్చివేత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా గోప్యత పాటిస్తోందని, అక్కడ ఏమి జరుగుతోందో ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మీడియాకు ఉందని, కానీ ప్రభుత్వం అక్కడకి ఎవరినీ అనుమతించడంలేదని, కనుక సచివాలయం కూల్చివేత పనులను కవర్ చేసేందుకు మీడియాను అనుమతించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆ మీడియా సంస్థలు పిటిషన్ వేశాయి.
దానిని విచారణకు స్వీకరించిన హైకోర్టు, సచివాలయం కూల్చివేత పనులను చిత్రీకరించేందుకు మీడియాను ఎందుకు అనుమతించడం లేదని అడ్వకేట్ జనరల్ ప్రసాద్‌ను ప్రశ్నించింది. అక్కడ ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశ్యంతో ఎవరినీ అనుమతించడం లేదని ఆయన సమాధానం చెప్పగా, మీడియాను అనుమతించకపోతే ప్రభుత్వమే కూల్చివేత పనులకు సంబందించి ఫోటోలు, వీడియోలను మీడియాకు అందజేయాలని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.