ఏపీ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం పంతానికి పోయి వరుసగా ఎదురుదెబ్బలు తింటోంది. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న ఆయనను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకపోయినప్పటికీ తొలగించి ఆయన స్థానంలో వేరొకరిని నియమించింది. అందుకోసం నిబందనలు మార్చుతూ ఓ ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ చెల్లదని, నిమ్మగడ్డను పదవిలో నుంచి తొలగించే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని కనుక ఆయనకు మళ్ళీ బాధ్యతలు అప్పగించాలని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి మే 29న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
కానీ ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడా ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బే తగిలింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు వరుసగా మూడుసార్లు నిరాకరించింది. అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్ళీ హైకోర్టును ఆశ్రయించడంతో తమ ఆదేశాలను అమలుచేయకపోవడం కోర్టు ధిక్కారమే అని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
నిమ్మగడ్డకు తిరిగి బాధ్యతలు అప్పగించాలనే తమ తీర్పు చాలా స్పష్టంగానే ఉంది కనుక ఓసారి గవర్నర్‌ను కలిసి కోర్టు ఆదేశాలను అమలుచేయవలసిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించమని కోరవలసిందిగా నిమ్మగడ్డకు హైకోర్టు సూచించింది. హైకోర్టు సూచన మేరకు ఆయన గవర్నర్‌ను కలిసి ఈ కోర్టు కేసులు, వాటి ఉత్తర్వుల గురించి వివరించారు.
దాంత్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ వ్రాశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం నిమ్మగడ్డకు తిరిగి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ఇక ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డకు పదవీ బాధ్యతలు అప్పగించడం తప్ప వేరే మార్గం కనబడటం లేదు. కానీ ఆయనను ఆ పదవి అప్పగిస్తే మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టవలసి వస్తుంది. అది వైసీపీకి చాలా నష్టం కలిగిస్తుంది. కనుక ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ వ్యవహారంలో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లైంది.