వాళ్ళిద్దరూ ఓకే...ఈరోజు మరో ఇద్దరికీ కోవాక్సిన్

July 22, 2020


img

కరోనా సోకకుండా అడ్డుకొనేందుకు భారత్‌ బయోటెక్ కంపెనీ తయారుచేసిన ‘కోవాక్సిన్‌’ టీకాను పరీక్షించేందుకు హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రితో సహా దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులలో క్లినికల్ ట్రయల్స్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం నిమ్స్‌ ఆసుపత్రిలో మొదటిసారిగా ఇద్దరు వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్‌ ఇచ్చి రెండు రోజులు ఆసుపత్రిలో ఉంచి చూశారు. రెండు రోజులలో వారికి ఎటువంటి ఆరోగ్యసమస్యలు తలెత్తకపోవడంతో వారిని మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి ఈ క్లినికల్ ట్రయల్స్‌కు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా వ్యవహరిస్తున్నారు. 

ఇద్దరు వాలంటీర్లు వారి సహజ పద్దతిలో, సహజ వాతావరణంలో ఉన్నప్పుడు వారికి కరోనా సోకకుండా కోవాక్సిన్‌ కాపాడగలుగుతోందా లేదా?కోవాక్సిన్‌ తీసుకొన్న తరువాత వారి ఆరోగ్య పరిస్థితి ఏవిధంగా ఉంది?సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా? వారి శరీరంలో యాంటీబాడీస్ ఏమేరకు అభివృద్ధి చెందాయి?వంటివన్నీ తెలుసుకొనేందుకే వారిరువురినీ డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించినట్లు తెలిపారు. ఈ రెండు వారాలలో వారితో ఫోన్‌ ద్వారా మాట్లాడుతూ, ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తుంటామని తెలిపారు. మళ్ళీ రెండువారాల తరువాత వారి రక్త నమూనాలు తీసి పరీక్షించి, వారి ఆరోగ్యపరిస్థితిని పరిశీలించిన తరువాత అంతా సవ్యంగా ఉంటే వారికి రెండో డోస్ కోవాక్సిన్‌ ఇస్తామని డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇవాళ్ళ మరో ఇద్దరికి కోవాక్సిన్‌ మొదటి డోసు ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు. 

మరో 13 మంది వాలంటీర్ల రక్తనమూనాలను డిల్లీలోని ఐసీఎంఆర్‌ ల్యాబ్‌కు పంపించగా వారిలో 8 మందికి ఫిట్ నెస్ సర్టిఫికేట్ జారీ చేసిందని, మిగిలినవారికి కూడా జారీ అయితే వారందరికీ కూడా కోవాక్సిన్‌ టీకా ఇచ్చి పరీక్షిస్తారు. మొదటి, రెండోదశ క్లినికల్ ట్రయల్స్‌లో మొత్తం 60 మందిపై, మూడో దశలో 100 మందిపై క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించవలసి ఉంటుందని క్లినికల్ ట్రయల్స్‌ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ తెలిపారు.

 ఈ ప్రయోగాలు పూర్తవడానికి సుమారు 2-3 నెలలు సమయం పట్టవచ్చు. ఈ క్లినికల్ ట్రయల్స్‌ విజయవంతమైతే ఈ ఏడాది చివరినాటికి కరోనా వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులోకి రావచ్చు. ఒకవేళ ఈ ప్రయోగాలన్నీ విఫలమైనా, అమెరికా తదితర దేశాలు తయారుచేస్తున్న వ్యాక్సిన్‌లలో ఏదో ఒకటి అందుబాటులోకి రావడం తధ్యం. కనుక 2021 సం.లో కరోనా బారి నుంచి ప్రపంచదేశాలు విముక్తిపొందడం ఖాయం.  



Related Post