అమెరికాతో పోటీ పడుతున్న భారత్‌

July 21, 2020


img

కరోనా కేసుల విషయంలో కూడా అమెరికాదే అగ్రస్థానం అనుకొంటున్న ఈ సమయంలో ఆ దేశంతో భారత్‌ పోటీ పడుతూ దూసుకుపోతోంది. గత వారం రోజులుగా అమెరికాలో రోజుకు సుమారు 60,000 కొత్త కేసులు నమోదవుతుండగా భారత్‌లో రోజుకు 37,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. అమెరికాతో పోలిస్తే భారత్‌లో జనాభా సుమారు నాలుగురెట్లు ఎక్కువున్నారు కనుక అతి త్వరలోనే పాజిటివ్ కేసుల విషయంలో అమెరికాను దాటిపోవడం ఖాయం.

అయితే కరోనా మరణాల విషయంలో అమెరికాదే అగ్రస్థానం కావచ్చు ఎందుకంటే భారత్‌లో రోజూ రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ భారతీయులలో రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండటం వలన చాలా మంది వేగంగా కొలుకొంటున్నారు.

అమెరికాలో ఇప్పటివరకు 39, 61, 805 కేసులు నమోదుకాగా వారిలో 18, 50,988 మంది మంది కోలుకొన్నారు. భారత్‌లోఇప్పటివరకు మొత్తం 11,55,191 కరోనా కేసులు నమోదుకాగా వారిలో 7,24,577 మంది కోలుకొన్నారు. అమెరికాతో పోలిస్తే భారత్‌లో మరణాల సంఖ్య కూడా చాలా తక్కువే అని చెప్పవచ్చు. అమెరికాలో ఇప్పటివరకు 1,40,922 మంది కరోనాకు బలికాగా భారత్‌లో 28,084 మంది మాత్రమే మరణించారు.

భారత్‌ ప్రజలలో కరోనా గురించి ఇప్పుడు చాలా అవగాహన ఏర్పడినప్పటికీ జాగ్రత్తలు పాటించకపోవడం, ప్రభుత్వాలు కూడా ప్రజలకు కరోనా పరీక్షలు చేసి రోగులను వేరు చేసి కరోనా వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తుండటం వంటి అనేక కారణాలతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య శరవేగంగా పెరిగిపోతోంది. కనుక రాబోయే ఒకటి రెండు నెలల్లోనే కరోనా కేసుల సంఖ్యలో భారత్‌ అమెరికాను దాటిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. 


Related Post