ప్రభుత్వం నిద్రపోతోందా? హైకోర్టు ప్రశ్న

July 20, 2020


img

కరోనా పరీక్షలు, కరోనా కట్టడి, కేసుల వివరాల ప్రకటన తదితర అంశాలపై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు ఉద్దేశ్యపూర్వకంగానే కరోనా సమాచారం దాచిపెడుతున్నారని భావిస్తున్నామని, అటువంటి అధికారులను సస్పెండ్ చేయించవలసివస్తుందని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పాటించనందుకు సంబందిత అధికారులపై చర్యలు తీసుకోవడానికి వెనకడబోమని కనుక ఇదే ఆఖరి అవకాశమని హెచ్చరించింది. 

ఏపీ, డిల్లీలో ప్రతీరోజు భారీగా కరోనా పరీక్షలు చేస్తుంటే తెలంగాణలో ఎందుకు చేయడం లేదని నిలదీసింది. జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలు హెల్త్ బులెటిన్‌లో ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించింది. ప్రభుత్వం ప్రకటిస్తున్న హెల్త్ బులెటిన్‌లపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్త  చేసింది. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుంటే ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని కానీ ప్రభుత్వం వారిని గాలికి వదిలేసినట్లుందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పట్ల తాము తీవ్ర అసంతృప్తిగా ఉన్నామని చెపుతుంటే, హైకోర్టు అభినందిస్తోందని హెల్త్ బులెటిన్‌లో ప్రభుత్వం చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని హైకోర్టు చురకలు వేసింది. ఈనెల 28నా జరిగే తదుపరి విచారణకు తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అలీ మూర్తుజా రజీ ఇద్దరూ హాజరవ్వాలని హైకోర్టు ఆదేశించింది.


Related Post