సచివాలయం కూల్చివేతలో జోక్యం చేసుకోము: గ్రీన్‌ ట్రిబ్యూనల్

July 20, 2020


img

తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేతకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు పర్యావరణ అనుమతులు తీసుకోనందున కూల్చివేత పనులు నిలిపివేయాలంటూ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి వేసిన పిటిషన్‌పై సోమవారం చెన్నైలోని గ్రీన్‌ ట్రిబ్యునల్ విచారణ జరిపింది. 

సచివాలయం కూల్చివేతకు రాష్ట్ర హైకోర్టు కూడా అనుమతించినందున ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కానీ కూల్చివేత సందర్భంగా ఏర్పడుతున్న పర్యావరణ కాలుష్యం, శిధిలాల తరలింపు వాటి నిర్వహణపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణశాఖ, కేంద్ర కాలుష్య నివారణ మండలి, తెలంగాణ కాలుష్య నివారణ మండలి, ఐఐటి హైదరాబాద్‌ నిపుణులతో కూడిన ఆ కమిటీ రెండు నెలలోగా నివేదిక సమర్పించవలసి ఉంటుంది. ఈ కేసుపై తదుపరి విచారణను సెప్టెంబర్ 25కి వాయిదా వేసింది. 

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు మొదటిసారి అనుమతించినప్పుడే దానికి మార్గం ఏర్పడిందని చెప్పవచ్చు. హైకోర్టు అనుమతితో 50 శాతం భవనాలు కూల్చివేసిన తరువాత దానిపై పిటిషన్లు వేయడం వలన కోర్టు, ట్రిబ్యూనల్ యొక్క విలువైన సమయాన్ని వృధా అయ్యింది తప్ప కూల్చివేతను ఆపలేకపోయాయి. ఒకవేళ ఆపగలిగినా సగం కూల్చిన మిగిలిన భవనాలను కూడా పూర్తిగా కూల్చుకోవడం మినహా మరేమీ చేయలేరని అందరికీ తెలుసు. ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా సచివాలయం కూల్చివేతకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది కనుక ఇక ఎటువంటి ఆటంకం ఉండకపోవచ్చు. 


Related Post