ఏపీలో జిల్లాకో కరోనా కాల్ సెంటర్

July 20, 2020


img

ఏపీ ప్రభుత్వం రోజుకు 20-25,000 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నందున ఏపీలో భారీగా కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే ఏపీలో 5,041 కొత్త కేసులు నమోదు కాగా, 56 మంది కరోనాతో చనిపోయారు. కానీ పరీక్షల ద్వారా కరోనా రోగులను గుర్తించి, వారిని మిగిలినవారి నుంచి వేరు చేయడం ద్వారా కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఏపీ ప్రభుత్వం చాలా తీవ్రంగా కృషి చేస్తోంది. కరోనా పరీక్షలు, కేసులు, మరణాల విషయంలో ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుండటంతో ఇరుగుపొరుగు రాష్ట్రాల ప్రజలు సైతం ఈవిషయంలో ఏపీ ప్రభుత్వాన్ని మెచ్చుకొంటున్నారు. 

ఏపీ ప్రభుత్వమే కరోనా సోకినవారి బాధ్యత స్వీకరించి వ్యాధి తీవ్రతను బట్టి వారిని హోమ్ క్వారెంటైన్‌ లేదా ప్రభుత్వ క్వారెంటైన్‌ లేదా ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తోంది. అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఇదేవిధానం అవలంభిస్తున్నప్పటికీ కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల తీరు ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. కరోనా కారణంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్న కొందరు హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఎక్కడా చేర్చుకోకపోవడంతో చనిపోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. కొంతమంది కరోనా రోగులు ట్విట్టర్‌ ద్వారా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఈవిషయం తెలియజేసి తమను ఆదూకోవలసిందిగా సాయం కోరుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 

ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని ప్రైవేట్, ప్రభుత్వాసుపత్రుల వైఖరితో తలనొప్పులు ఎదుర్కొంటోంది. ఈ సమస్యకు పరిష్కారంగా జిల్లాకో కరోనా కాల్ సెంటర్స్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇవి కాక ప్రతీ కరోనా ఆసుపత్రిలో ప్రత్యేకంగా కరోనా హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేకంగా ఓ నోడల్ అధికారిని ఏర్పాటుచేస్తోంది. 

ప్రభుత్వం ఏర్పాటుచేయబోతున్న ఈ కాల్ సెంటర్స్‌లో 24X7 గంటలు పనిచేస్తాయి. వీటిలో ఒక్కో షిఫ్ట్ కు ఐదుగురు చొప్పున మొత్తం 15 మంది పనిచేస్తారు. వారు కరోనా రోగులకు అవసరమైన సమాచారం, సహాయసహకారాలు అందించడమే కాక ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రులపై పిర్యాదులను కూడా స్వీకరిస్తారు. కరోనా రోగులను చేర్చుకోవడానికి ఏ ఆసుపత్రైనా నిరాకరించినట్లయితే, నేరుగా అక్కడి నుంచే కాల్ సెంటర్స్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినట్లయితే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెంటనే అవసరమైన చర్యలు చేపడుతుంది. 

కరోనా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన రోగుల ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకు ఈ కాల్ సెంటర్స్‌ సమాచారం అందిస్తుంటాయి. ఏపీలో రోజురోజుకీ కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నప్పటికీ కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషి వలన ప్రజలకు భరోసా కలిగించగలుగుతోంది. 


Related Post