బిజెపి బాటలో టి-కాంగ్రెస్‌...

July 18, 2020


img

అన్‌లాక్‌-2 ఆంక్షలలో భాగంగా రాజకీయ సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేదం కొనసాగుతున్నందున బిజెపి ‘జన్ సంవాద్’ పేరిట ఆన్‌లైన్‌ ర్యాలీలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా కరోనా బారిన పడుతుండటంతో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ‘స్పీక్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో ఓ ఆన్‌లైన్‌ ఉద్యమం ప్రారంభించారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఉద్యమం ప్రదానోదేశ్యం రాష్ట్రంలో కరోనా బాధితులకు అండగా నిలబడుతూనే వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం. దీనికి సంబందించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిమాండ్లను ఈరోజు కార్యక్రమంలో చర్చకు పెట్టింది. 

1. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలి. 

2. రాష్ట్రంలో కరోనా పరీక్షలను పెంచాలి. 

3. ప్రభుత్వ ఆసుపత్రులలో సరిపడినన్ని ఆక్సిజన్ సిలెండర్లు, వెంటిలేటర్లు సిద్దంగా ఉంచాలి. 

4. కరోనాతో మరణించినవారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలి. 

5. కరోనాతో ప్రత్యక్ష పోరాటం చేస్తూ మరణించిన వైద్యులు, వైద్య, పారిశుధ్య, పోలీస్ సిబ్బంది కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం అందించాలి. 

6. ప్రైవేట్ ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయకుండా ప్రభుత్వం నియంత్రించాలి. 

7. ప్రైవేట్ ఆసుపత్రులలో 50 శాతం పడకలు ప్రభుత్వం అధీనంలో ఉండాలి. 

ఈ డిమాండ్లపై జరిగే చర్చలో రాష్ట్రంలో మేధావులు, విద్యావేత్తలు, ప్రముఖులు, అన్ని రంగాలకు చెందినవారిని భాగస్వాములుగా చేయాలని కోరారు. అందరూ తమ అభిప్రాయాలను, సూచనలను, సలహాలను వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఇంస్టాగ్రామ్ తదితర సామాజిక మాద్యమాల ద్వారా ఇతరులకు షేర్ చేయాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


Related Post