ప్రైవేట్ ఆసుపత్రులకు సిఎం కేసీఆర్‌ హెచ్చరిక

July 18, 2020


img

ప్రభుత్వాలకు, ప్రజలకు కరోనా శాపంగా మారితే, ప్రైవేట్ ల్యాబ్‌లు, ఆసుపత్రులకు అదే..కాసుల వర్షం కురిపిస్తోంది. కరోనా సోకితే చనిపోతామనే ప్రజలలో భయాలను ప్రైవేట్ ఆసుపత్రులు సొమ్ము చేసుకొంటున్నాయి. ఈ విషయం సిఎం కేసీఆర్‌కు దృష్టికి రావడంతో ఆయన ప్రైవేట్ ఆసుపత్రులను గట్టిగా హెచ్చరించారు. 

శుక్రవారం ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ వైద్యశాఖ అధికారులతో రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై జరిగిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ప్రైవేట్ ఆసుపత్రులలో బెడ్లు లేవని చెప్పి కృత్రిమ కొరత సృష్టించినా, ప్రభుత్వం ప్రకటించిన దానికంటే ఎక్కువ ఫీజులు వసూలు చేసినా ప్రైవేట్ ఆసుపత్రులపై కఠినచర్యలు తీసుకోవడానికి వెనకాడవద్దు. ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది కూడా. కనుక ప్రజలెవరూ ప్రైవేట్ ఆసుపత్రులకు పోనవసరం లేదు. వాటి కంటే ప్రభుత్వ ఆసుపత్రులలోనే మెరుగైన సేవలు ఉచితంగా అందిస్తున్నాము. కరోనా ఇప్పట్లో పోయేది కాదని స్పష్టం అయ్యింది కనుక దానితో సహజీవనం చేయకతప్పదు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా పెరిగింది కనుక కరోనా సోకినా ఎవరూ భయపడనవసరం లేదు. అలాగని ఎవరూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటూనే పనులు చేసుకోవలసి ఉంటుంది,” అని అన్నారు. 

ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ నర్సులకు కూడా జీతాలు పెంచి ఇన్సెంటివ్‌లు కూడా చెల్లిస్తామని చెప్పారు. పీజీ పూర్తిచేసిన 1,200 మంది వైద్య విద్యార్దులను వెంటనే ప్రభుత్వాసుపత్రులలోకి తీసుకోవాలని, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కొత్తగా 200 మంది వైద్యులను నియమించాలని సిఎం కేసీఆర్‌ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.


Related Post