హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కంపెనీ తయారుచేసిన ‘కోవాక్సిన్’ (కరోనాను నిరోధించే వ్యాక్సిన్) క్లినికల్ ట్రయల్స్ ఈ నెల 15 నుంచి మొదలైనట్లు ఆ సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 12 ఆసుపత్రులలో 375 మంది వాలంటీర్లపై దానిని ప్రయోగించి చూస్తున్నట్లు తెలిపింది. ఆ 12 ఆసుపత్రులలో హైదరాబాద్‌లో నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్ (నీమ్స్ ఆసుపత్రి) కూడా ఒకటి.
ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ రెండు దశలలో నిర్వహిస్తారు. మొదటిదశ 28 రోజులపాటు కొనసాగుతుంది. వాటి ఫలితాలను బట్టి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి. ఐసీఎంఆర్, పూణేలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీల సహకారంతో ఈ వ్యాక్సిన్‌ను తయారుచేసినట్లు భారత్ బయోటెక్ కంపెనీ తెలిపింది.
ఇదిగాక గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జైడస్ కాడిలా హెల్త్ కేర్ కంపెనీ కూడా ఓ వ్యాక్సిన్ తయారుచేసింది. దానికి కూడా మొదటి రెండుదశల క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అవసరమైన అనుమతులు మంజూరు చేసింది. వాటికి సంబందించి వివరాలు తెలియవలసి ఉంది.