గణాంకాలు...పోల్చుడు సరే...కానీ భద్రత ఏది?

July 17, 2020


img

దేశంలో ఇప్పుడు రోజుకు 30,000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నందున ప్రతీ మూడు రోజులకు ఓ లక్ష కేసులవుతున్నాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య కూడా శరవేగంగా పెరుగుతోంది. ఎప్పుడైతే కరోనా రోగులు పెరుగుతారో కరోనా వైరస్ ఇంకా వేగంగా వ్యాపిస్తుంటుంది. వ్యాప్తి వేగం అంటే రోజుకు నమోదయ్యే కేసుల సంఖ్య పెరిగినకొద్దీ మొత్తం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. కనుక ఇదొక చక్రంలా తిరుగుతూ ముందుకు సాగిపోతూనే ఉంటుందని చెప్పవచ్చు. ఈ లెక్కన పెరిగుతుంటే రానున్న రోజులలో ప్రపంచ దేశాలలోకెల్లా భారత్‌లోనే ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఇది చాలా ముందే ఊహించినదే. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ కూడా శాస్త్రీయంగా లెక్కలు కట్టి సెప్టెంబర్ 1వ తేదీ నాటికి దేశంలో 35 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 

130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌లో ప్రతీ పదిలక్షల మందిలో 727.4 మంది మాత్రమే కరోనా బారిన పడుతున్నారు. శుక్రవారం నాటికి భారత్‌లో 10 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కాగా 6.35 లక్షల మంది కోలుకొన్నారు. భారత్‌లో రికవరీ రేటు 63.33 శాతం ఉన్నందున పాజిటివ్ కేసులు పెరిగినప్పటికీ ఆందోళన చెందనవసరంలేదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

ఈ కరోనా గణాంకాలు... పోల్చి చూసుకోవడాలు కాగితాల మీద బాగానే ఉన్నాయి. కానీ పేద, మధ్యతరగతి ప్రజలు రోజువారీ పనులు, ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళేందుకు భయపడుతున్నారు. కరోనా భయంతో ఇంట్లో కూర్చోంటే ఇల్లు గడవదు. కనుక తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్ళి ఉద్యోగాలు, పనులు చేసుకొందామంటే కరోనా సోకే ప్రమాదం నానాటికీ పెరిగిపోతుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర భయాందోళనలతో ఉన్నారు. ఇంట్లో నుంచి కాలు బయట  మళ్ళీ కరోనా సోకకుండా క్షేమంగా తిరిగివస్తామో లేదో అనే భయంతో సతమతమవుతున్నారు. కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైఖరి చూసి ఒకవేళ కరోనా సోకితే మా పరిస్థితి ఏమిటని సామాన్య ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు.

ఈ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం కరోనా వ్యాక్సిన్‌ మాత్రమే. అది సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఎంత సమయం పడుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. కనుక అంతవరకు ప్రజలు ఈ భయాందోళనలతోనే జీవించక తప్పదేమో? 


Related Post