అవును! అక్షరాల 263 కోట్లు గంగలో కలిసిపోయాయి. కలిసిపోయాయనేకంటే కొట్టుకుపోయాయనడం సబబుగా ఉంటుందేమో? అయితే వరదలలో కొట్టుకుపోయినవి కరెన్సీ కట్టలు కావు...అంత ఖర్చు చేసి నిర్మించిన వంతెన!పోనీ అదేదో పాత వంతెన అనుకొందామా అంటే అసలే కాదు. దానికి ప్రారంభోత్సవం జరిగి నేటికీ సరిగ్గా 29 రోజులే అయ్యింది. సుమారు ఎనిమిదేళ్ళు కష్టపడి నిర్మించిన ఆ వంతెన ప్రారంభించిన 29 రోజులకే వరదలలో కొట్టుకుపోయింది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో గోపాల్‌గంజ్ జిల్లాలో బుదవారం జరిగింది.
బిహార్ ప్రభుత్వానికే చెందిన బిహార్ రాజ్య్ పూల్ నిగమ్ గోపాల్‌గంజ్, చంపారన్ జిల్లాలను కలిపేందుకు సత్తర్‌ఘాట్ ప్రాంతంలో గండకీ నదిపై 1.4 కిమీ పొడవు గల వంతెనను 8 ఏళ్ళు కష్టపడి నిర్మించింది. జూన్‌కు 16న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్ స్వయంగా దానిని ప్రారంభించారు. ఇన్నాళ్లకు తమ కష్టాలు తీరాయని గోపాల్‌గంజ్, చంపారన్ జిల్లాల ప్రజలు సంతోషించేలోపే ఆ వంతెన వరదలలో కొట్టుకుపోవడంతో అందరూ దిగ్బ్రాంతి చెందారు. వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులు ఇచ్చి ఉండి ఉంటే, దాంతో నాసిరకం పనులు చేసి ఉండవచ్చని భావించవచ్చు. కానీ 1.4కిమీ పొడవు వంతెన నిర్మాణానికి బిహార్ ప్రభుత్వం రూ.263 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కసారి గట్టిగా వరదలు వచ్చేసరికి 8 ఏళ్ళపాటు నిర్మించిన వంతెన 29 రోజులకే కొట్టుకుపోయింది. అంటే 263 కోట్ల ప్రజాధనం వరదలలో కొట్టుకుపోయినట్లే కదా?