అందుకే బదిలీల వేటు?

July 16, 2020


img

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అటవీశాఖకు,  ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ విభాగం కమీషనర్ యోగితా రాణా సాంఘిక సంక్షేమశాఖకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. వారితో పాటు పలువురు ఐఏఎస్ అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శిని, ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ విభాగం కమీషనర్‌ను బదిలీ చేయడం, వారి స్థానంలో మంచి సమర్ధులైన అధికారులుగా పేరు తెచ్చుకొన్న సయ్యద్ అలీ మూర్తుజా రిజ్వీ, వాకాటి అరుణలను నియమించడం ఆలోచించవలసిన విషయం.

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ కేంద్రప్రభుత్వం, హైకోర్టు, ప్రతిపక్షాలు పదేపదే విమర్శలు ఆరోపిస్తుండటంతో ప్రభుత్వం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోంది. బహుశః అందుకే వారిరువురినీ అప్రధాన్యశాఖలకు బదిలీ చేసి ఉండవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా కేసులు, కరోనా పరీక్షలు, ఆసుపత్రులలో వైద్య సౌకర్యాలు తదితర అంశాలపై హైకోర్టులో జరుగుతున్న విచారణలలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తరపున బలంగా వాదించకపోవడం వలన ప్రభుత్వానికి అప్రదిష్ట కలుగుతుండటం కూడా శాంతికుమారి బదిలీకి మరో కారణంగా కనిపిస్తోంది. 

ఆమె స్థానంలో నియమితులైన రిజ్వీ ఈరోజు ఉదయమే బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ని కలిసి రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌ పరిధిలో కరోనా కేసులు, పరీక్షల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రిజ్వీ అధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ ఏవిధంగా కరోనాను కట్టడి చేస్తుందో చూడాలి. 


Related Post