ఆక్సిజన్ అందక రాష్ట్రంలో మరో ఇద్దరు మృతి

July 16, 2020


img

తెలంగాణ ప్రభుత్వం ప్రతీరోజు విడుదల చేస్తున్న కరోనా హెల్త్ బులెటిన్లలలో ఏ ఆసుపత్రిలో ఎన్ని బెడ్లు, వెంటిలేటర్లు ఖాళీగా ఉన్నాయి...ఆక్సిజన్ సౌకర్యం కలిగిన ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయి..వంటి వివరాలను ప్రకటిస్తోంది. అయితే ఆక్సిజన్ అందక రాష్ట్రంలో కరోనా రోగులు చనిపోతూనే ఉండటం గమనిస్తే గణాంకాలకు వాస్తవాలకు పొంతన లేదనిపించకమానదు. 

ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో కొన్ని రోజుల క్రితం ఓ కరోనా రోగి తాను ఊపిరి తీసుకోలేకపోతున్నాను ఆక్సిజన్ పెట్టమని వైద్యులను బ్రతిమాలుకొన్నా పట్టించుకోలేదని, ఊపిరి అందక నరకం అనుభవిస్తున్నానని చెపుతూ తన మొబైల్ ఫోన్‌లో సెల్ఫీ వీడియోను తీసి తండ్రికి పంపించి చనిపోయాడు. అయితే ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అతని ఆరోపణలను ఖండించారు. 

ఆ తరువాత నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలెండర్లు లేకపోవడంతో ఒకేరోజు నలుగురు చనిపోయారు. అందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తన పదవికి రాజీనామా చేశారు. 

తాజాగా రాష్ట్రంలో మరో ఇద్దరు కరోనా రోగులు సకాలంలో ఆక్సిజన్ పెట్టకపోవడంతో చనిపోయారు. వారిలో ఒకరు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గొల్ల శ్రీధర్ అనే 33 ఏళ్ళ యువకుడు కాగా, మరొకరు కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన నిండు గర్భిణి. 

నేరేడ్ మెట్టలోని సాయి నగర్‌కు చెందిన శ్రీధర్‌కు కరోనా సోకడంతో మొదట ఉస్మానియాలో ఆ తరువాత గాంధీ ఆసుపత్రిలో గత 5 రోజులుగా చికిత్స పొందుతున్నాడు. బుదవారం తెల్లవారుజామున 3.30 గంటలకు శ్రీధర్ తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి, “ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను...ఆక్సిజన్ పెట్టాలని బ్రతిమాలుకొన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మరెంతోసేపు నేను బ్రతకను...మీరందరూ జాగ్రత్తగా ఉండండి,” అంటూ చెప్పి కొద్దిసేపటికి చనిపోయాడు. అయితే ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాకు కొరత లేదని అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమ్మె చేస్తుండటం వలన శ్రీధర్‌కు సకాలంలో ఆక్సిజన్ పెట్టలేకపోయామని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు చెప్పారు. 

కామారెడ్డి కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి కరోనా సోకడంతో జిల్లా వైద్య సిబ్బంది వారినందరినీ ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారిలో 9 నెలల నిండు గర్భిణీ కూడా ఉంది. మంగళవారం రాత్రి ఆమె ఊపిరి పీల్చుకోలేకపోతుండటంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ముందు ఆక్సిజన్ పెట్టాలని వారు వైద్యులను ఎంతగా వేడుకొన్నప్పటికీ ఆమె పరిస్థితి విషమిస్తోంది కనుక ఆసుపత్రిలో చేర్చుకోలేమని వెంటనే గాంధీ ఆసుపత్రి తరలించాలని సూచించారు. ఆమెను అంబులెన్స్‌లో తీసుకువెళుతుండగా దారిలో రామాయంపేట చేరుకొనేసరికి చనిపోయింది. ఆమెతో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా! 

ఈ ఘటనపై జిల్లా ఆసుపత్రుల ఇన్‌ఛార్జ్ అజయ్ కుమార్ స్పందిస్తూ, “కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నందున ఆమె శ్వాసవ్యవస్థ పనిచేయకపోవడంతో చనిపోయింది. ఆరోగ్య పరిస్థితి అంత విషమంగా ఉన్నప్పుడు ఇక్కడ ఆసుపత్రిలో చికిత్స చేయడం కష్టం కనుకనే గాంధీ ఆసుపత్రికి తరలించమని వైద్యులు సూచించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ అందించకపోవడం వలన ఆమె చనిపోయారనే ఆరోపణ సరికాదు,” అని అన్నారు.   

వైద్యులు, సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారనే దానిలో ఎటువంటి సందేహమూ లేదు కానీ ఆసుపత్రులలో తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు లేనందునో లేదా సకాలంలో ఆక్సిజన్ పెట్టకపోవడం వలననో కరోనా రోగులు చనిపోతుంటే అప్పుడు అందరూ వారిని... వారితో పాటు ప్రభుత్వాన్ని కూడా  వేలెత్తి చూపుతారని గ్రహిస్తే మంచిది.


Related Post