కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం

July 15, 2020


img

తెలంగాణలో కరోనా కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్ధంగా వ్యవహరించలేకపోతోందన్నట్లు పేర్కొన్న       కేంద్రప్రభుత్వం అధికారిక సమాచార సంస్థ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి)పై తెలంగాణ ప్రభుత్వం ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేసింది. పిఐబి నివేదికలపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, తెలంగాణ, డాక్టర్ శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పిఐబి నివేదిక తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని అన్నారు. వాస్తవానికి కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర హైకోర్టు చాలా ప్రశంసిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఐసీఎంఆర్‌, కేంద్రప్రభుత్వం జారీచేస్తున్న మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తోందన్నారు. కరోనా కట్టడి గురించి పిఐబిలో ప్రచురిస్తున్న నివేదికలు తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేవిగా ఉంటున్నాయని అటువంటి వార్తలను నమ్మవద్దని డాక్టర్ శ్రీనివాసరావు ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజలను కరోనా నుంచి కాపాడుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను చేపడుతోందని డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు.

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అనేకచర్యలు చేపట్టిన మాట వాస్తవం. అయితే మొదట్లో చూపించినంత ఆసక్తి ఇప్పుడు కనిపించడం లేదని సాక్షాత్ హైకోర్టే అంది. పరిమిత సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించడంపై హైకోర్టు చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తరువాతే రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలను పెంచింది. అప్పటి నుంచే రాష్ట్రంలో కరోనా కేసులు బయటపడటం మొదలైంది. దాంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య హటాత్తుగా పెరగడం ప్రారంభించి 37,745కి చేరుకొంది. రాష్ట్రంలో రోజుకు 1,500-1,800 కేసులు నమోదవున్నందున త్వరలోనే 50,000కి చేరుకోవడం తధ్యం. ఎప్పుడైతే ఆ స్థాయికి చేరుకొంటుందో అప్పుడు ఇంకా వేగంగా పాజిటివ్ కేసులు పెరుగుతాయని జాతీయ స్థాయి గణాంకాలు చూస్తే అర్ధమవుతుంది. కరోనా రోగులు పెరిగేకొద్ది కోలుకోనేవారితో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది. రాష్ట్రంలో ఇప్పుడు ప్రతీరోజు 7-10 మంది కరోనాతో మరణిస్తున్నారు. దాంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 375కి చేరింది. ఇవే విషయాలు పిఐబి రిపోర్టులలో పేర్కొంది. 


కరోనా కట్టడి విషయంలో కేంద్రం, హైకోర్టు, ప్రతిపక్షాలు, మీడియా చేస్తున్న విమర్శలపై రాష్ట్ర ప్రభుత్వానికి అసహనం కలగడం సహజమే. కానీ రాష్ట్రంలో ప్రతీరోజు సుమారు 1500-1800 పాజిటివ్ కేసులు  నమోదవుతుండటం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. కనుక కరోనా కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరింత గట్టిగా కృషి చేసుకొంటూపోవడమే తక్షణ కర్తవ్యం. అదే ఆ విమర్శలన్నిటికీ సమాధానం అవుతుంది. 



Related Post