కరోనా కట్టడి బాధ్యత కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలది మాత్రమేనా?

July 14, 2020


img

భారత్‌లో ప్రతీరోజు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా కొత్తగా 28,498 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న దేశాలలో అమెరికా, బ్రెజిల్ దేశాల తరువాత భారత్‌ 3వ స్థానంలో ఉంది. భారత్‌లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్నప్పటికీ వారిలో 60 శాతంకీ పైగా కోలుకోవడం చాలా ఊరట కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 9,07,645 మందికి కరోనా సోకగా వారిలో 5,71,540 మంది కోలుకొన్నారు. కానీ దేశంలో కరోనా మరణాలు కూడా క్రమంగా పెరిగిపోతున్నాయి. సోమవారం ఒక్కరోజే భారత్‌లో 540 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 23,727కి చేరినట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్యశాఖ తెలిపింది.

భారత్‌లో నాలుగు నెలల వ్యవదిలో 9 లక్షల మందికి కరోనా బారిన పడ్డారు. దేశంలో ప్రతీరోజు కొత్త కేసులు నమోదవుతుండటం వలననే ఇంతమందికి కరోనా సోకినట్లు అర్ధమవుతోంది. అయితే వారిలో సుమారు 6 లక్షల మంది కోలుకొన్నారు. అంటే కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందినప్పటికీ కరోనా రోగులను కోలుకొనేచేయడంలో విజయం సాధించినట్లు అర్ధమవుతోంది.

ఈ వైఫల్యాలకు కేవలం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలనే నిందించడం సరికాదు. దేశ ప్రజలకు కరోనా గురించి పూర్తి అవగాహన ఏర్పడినప్పటికీ, జీవనోపాధి కోసమో బయటకు వెళ్ళక తప్పని పరిస్థితుల వలననో లేదా  ప్రజల క్రమశిక్షణారాహిత్యం, అవగాహనారాహిత్యం, నిర్లక్ష్యం వంటి కారణాల చేత ప్రతీరోజు కొత్తగా కేసులు నమోదవుతున్నట్లు చెప్పవచ్చు. కనుక వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేవరకు దేశప్రజలు మరికాస్త సంయమనం పాటించి వీలైనంత వరకు ఇళ్ళకే పరిమితమవుతూ, బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు కరోనా జాగ్రతలన్నీ పాటించగలిగితే దేశం కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందగలదు లేకుంటే వ్యాక్సిన్‌ వచ్చేవరకు ఈ ఖరీదైన కరోనా విషాదకర సీరియల్ కొనసాగుతూనే ఉంటుంది. 


Related Post