సినిమా హాల్స్ తెరుచుకోకపోతే సినీపరిశ్రమ పరిస్థితి ఏమిటి?

July 10, 2020


img

మొదట్లో లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగులు... రికార్డింగులు... సినిమా హాళ్ళు అన్నీ బంద్‌ అయ్యాయి. ఇప్పుడు కరోనా భయంతో మళ్ళీ అన్నీ మూసుకొని కూర్చోవలసివస్తోంది. ఆమద్యన సినీ ప్రముఖులు కొందరు సినిమా షూటింగులకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ కరోనా భయంతో షూటింగులు చేసుకోలేని దుస్థితి ఏర్పడింది. 

సినిమా షూటింగులు జరుగకపోవడంతో సినీపరిశ్రమపైనే ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్న వేలాదిమంది జూనియర్ కళాకారులు, సిబ్బంది రోడ్డునపడుతున్నారు. సినీనటులు, దర్శకనిర్మాతలు తదితరులు కూడా పనిలేక చేతులు ముడుచుకొని కూర్చోవలసివస్తోంది. లాక్‌డౌన్‌ మొదలైన కొత్తలో ఇంట్లో గిన్నెలు తోముతూ, ఇల్లు ఊడుస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ అభిమానులను అలరించారు. కానీ కరోనా ఇంకా ఇలాగే కొనసాగితే ఇక ఎప్పటికీ అవే పనులుచేసుకొంటూ కాలక్షేపం చేయాలేమో అని వారుకూడా భయపడుతున్నారు. 

సినిమా షూటింగులు నిలిచిపోతే సినిమా డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు కూడా తీవ్రంగా నష్టపోతారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమా థియేటర్లు కూడా ఆధునిక సౌకర్యాలతో ఉండాలనే ఉద్దేశ్యంతో కోట్లు ఖర్చు పెట్టి సినిమా థియేటర్లను రినోవేషన్ చేయించినవారు రెండు తెలుగు రాష్ట్రాలలో కోకొల్లలున్నారు. వారందరూ ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోక చేసిన అప్పులు, వాటికి వడ్డీలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. 

మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు లాక్‌డౌన్‌ సమయంలో అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహా వంటి ఓటిటీ ప్లాట్‌ఫారంలకు ప్రజాధారణ పెరగడంతో అది సినిమా థియేటర్ల యాజమానుల పాలిట శాపంగా మారింది. వాటితో ఓ స్థాయి నటీనటులు, దర్శకనిర్మాతలు, కొందరు సాంకేతిక సిబ్బంది ఒడ్డున పడవచ్చునేమో కానీ సినిమా థియేటర్ల యాజమానులకు అది కోలుకోలేని పెద్ద దెబ్బే అవుతుంది. ఒకవేళ మళ్ళీ సినిమా థియేటర్లు తెరుచుకొన్నా కరోనా భయంతో ప్రేక్షకులు వస్తారో రారో తెలీదు. పైగా ఈ ఓటిటీలలో కొత్త సినిమాలు నేరుగా విడుదలైపోతుంటే ఇక థియేటర్లకు ఎవరు వస్తారు? అని యజమానులు ఆందోళన చెందుతున్నారు. 

ఈవిధంగా కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న మన సినీపరిశ్రమ మళ్ళీ ఎప్పటికీ కొలుకొంటుందో తెలీదు కానీ ఆలోగా దానిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడినవారు ఆర్ధికసమస్యల సుడిగుండంలో చిక్కుకొని కనుమరుగయిపోయే ప్రమాదం కనిపిస్తోంది.


Related Post