కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి ప్రియాంకా వాద్రా డిల్లీలోని లోథీరోడ్డులో ఉన్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి తన వస్తువులను 10 జనపధ్ లోగల తన తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలిస్తున్నారు. లోథీరోడ్డులో ఉన్న ప్రభుత్వ బంగ్లాను ఆగస్ట్ 1వ తేదీలోగా ఖాళీ చేయవలసిందిగా ఇటీవల నోటీసు అందుకోవడంతో ఆమె ఆ బంగ్లాను ఖాళీ చేస్తున్నారు. ఇటీవల ఆమెకు కేంద్రహోంశాఖ ప్రత్యేక భద్రతను ఉపసంహరించడంతో అటువంటి సదుపాయం కలిగిన ఆ బంగ్లాను ఖాళీచేయవలసిందిగా ప్రభుత్వం కోరింది. ఆమెను బంగ్లా ఖాళీ చేయించడంపై కాంగ్రెస్ పార్టీ కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించినా, ఆమె గడువు కంటే చాలా ముందుగానే బంగ్లా ఖాళీ చేస్తుండటం విశేషం.
అయితే ఆమె త్వరలోనే యూపీలోని లక్నోకు మకాం మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పుటినిల్లువంటి ఉత్తరప్రదేశ్‌లో అధికారం కోల్పోయి మూడు దశాబ్ధాలైంది. కనుక మళ్ళీ యూపీలో బలం కూడగట్టుకొని అధికారంలోకి వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సాధించడం కష్టమని ప్రియాంకా వాద్రా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే లక్నోలోని తమ బందువు షీలాకౌల్‌కు చెందిన ఓ భవనంలో మకాంపెట్టి అక్కడి నుంచే యూపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ప్రియాంకా వాద్రా భావిస్తున్నారు. కానీ డిల్లీకి వచ్చినప్పుడు తన తల్లి సోనియా గాంధీ ఇంట్లో ఉంటే యూపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను ఆమెతో చర్చించవచ్చుననే ఉద్దేశ్యంతో ప్రియాంకా వాద్రా డిల్లీలో వేరే ఇల్లు తీసుకోవడంలేదని సమాచారం.