ప్రైవేట్ ఆసుపత్రులకు హైకోర్టు నోటీసులు

July 08, 2020


img

రాష్ట్రంలో కరోనా రోగులకు వైద్య చికిత్సలందిస్తున్న హైదరాబాద్‌లోని నాలుగు ఆసుపత్రులకు హైకోర్టు బుదవారం నోటీసులు జారీ చేసింది. ఆ నాలుగు ఆసుపత్రులు ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీల కంటే చాలా భారీగా రోగుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నాయని, వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది శ్రీకిషన్ శర్మ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన పిటిషన్‌ (పిల్) దాఖలుచేషారు. హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం దానిపై బుదవారం విచారణ చేపట్టింది. 

ఈ సందర్భంగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం తరపు వాదించిన అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రైవేట్ ఆసుపత్రులు చట్టాలను, ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను, నిబందలను, ప్రభుత్వ ఆదేశాలను యధేచ్చగా ఉల్లంఘిస్తూ కరోనా పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకొంటుంటే ప్రభుత్వం ఏమి చేస్తోందని ధర్మాసనం ప్రశ్నించింది. వాటి దోపిడీ గురించి మీడియాలో వస్తున్న వార్తలు న్యాయమూర్తుల దృష్టికి వస్తున్నప్పుడు, ప్రభుత్వం దృష్టికి రాలేదా? అని ప్రశ్నించింది. 

ఈ ప్రైవేట్ దోపిడీపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకొందో పూర్తి వివరాలను తెలియజేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్ పేర్కొన్న జంటనగరాలలో గల యశోదా సూపర్ స్పెషాలిటీ, కేర్, సన్‌షైన్, మెడికవర్ ఆసుపత్రులకు దీనిపై వివరణ కోరుతూ హైకోర్టు నోటీసులు పంపింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. 

కరోనా సోకినవారిలో సామాన్యప్రజలు ప్రభుత్వాసుపత్రులలో చేరి చికిత్స చేయించుకొంటున్నారు. ప్రభుత్వాసుపత్రులలో అరకొర సౌకర్యాలుండటం, ఇంట్లో ఉండి కరోనాకు చికిత్స తీసుకొందామంటే ప్రత్యేకంగా గది లేకపోవడంతో కొందరు మధ్యతరగతి ప్రజలు, ఆర్ధికంగా స్తోమతు ఉన్నవారు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరుతున్నారు. వారి సంఖ్య అధికంగానే ఉంది కనుక ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టం వచ్చినంత డబ్బు పిండుకొంటున్నాయి. 

ఈ ప్రైవేట్ దోపిడీ గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొన్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిన్న ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమస్యపై హైకోర్టు కూడా నిన్ననే విచారణ చేపట్టి ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది. ఈ సమస్యపై గవర్నర్‌, హైకోర్టు స్పందించే వరకు ప్రభుత్వం దృష్టికి రాకపోవడం విస్మయం కలిగిస్తుంది.


Related Post