చైనా తోకముడిచిందా... నమ్మోచ్చా?

July 07, 2020


img

గత రెండు నెలలుగా గల్వాన్ లోయలో తిష్టవేసి 22 మంది భారత్‌ జవాన్లను పొట్టన పెట్టుకొని యుద్ధభేరీలు మోగించిన చైనా భారత్‌ ధాటికి తట్టుకోలేక తోక ముడిచిందని అన్ని ప్రధాన పత్రికలలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. రెండు నెలలుగా ఉన్నతస్థాయి సైన్యాధికారులు చర్చలు జరుపుతున్నప్పటికీ ఒక్క అడుగు కూడా వెనక్కు వెళ్ళని చైనా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్, చైనా విదేశాంగమంత్రితో ఫోన్లో మాట్లాడగానే చైనా సేనలు కిలోమీటరు వెనక్కు వెళ్లిపోయాయని మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. అయితే రాజ్యవిస్తరణ కాంక్ష, దురహంకారంతో విర్రవీగే చైనా, అజిత్ దోబల్ నాలుగు మాటలు మాట్లాడగానే వెనక్కు వెళ్లిపోయిందంటే  నమ్మశఖ్యంగా లేదు. 

ఎందుకంటే గతంలో కూడా చైనా ఇదేవిధంగా భారత్‌ భూభాగాలోకి చొరబడి హడావుడి చేయడం, ఇరు దేశాల సైనికుల మద్య కొన్ని ఘర్షణలు, ఆ తరువాత సైన్యాధికారుల స్థాయిలో చర్చలు, చివరిగా విదేశాంగమంత్రులు మాట్లాడుకొన్నాక చైనా వెనక్కువెళుతుండేది. ఇప్పుడూ అదేవిధంగా జరిగినట్లు అర్ధమవుతోంది. అయితే ఈసారి భారత్‌ విదేశాంగమంత్రి బదులు అజిత్ దోబల్ చైనా విదేశాంగమంత్రితో మాట్లాడారు. అంతే తేడా! 

అయితే మన ధాటికి తట్టుకోలేక చైనా ఒక్క కిలోమీటరు వెనక్కు వెళ్లిపోయిందని గొప్పగా చెప్పుకోవడం మనకు సంతృప్తి, సంతోషం కలిగించవచ్చు. కానీ భారత్‌ భూభాగంలో చైనా ఎంత ముందుకు చొచ్చుకు వచ్చింది?దానిని పూర్తిగా మనకు విడిచిపెట్టి వెనక్కు వెళ్లిపోయిందా లేక అది ఆక్రమించుకొన్న భారత్‌ భూభాగంలో ఒక కిలోమీటరు మాత్రమే మనకు విడిచి పెట్టి వెనక్కు జరిగిందా?అనే విషయం ఎవరికీ తెలియదు. 

చైనా ‘క్యాబేజీ ఫార్ములా’ను అమలుచేస్తుంటుందని మన మిలటరీ అధికారులే చెపుతున్నారు. అంటే ఇరుగుపొరుగు దేశాలకు చెందిన చిన్న చిన్న భూభాగాలను ఆక్రమించుకొని అవి తమవే అని మొదట వాదించడం, ఆనక విదేశాంగమంత్రుల స్థాయిలో చర్చలు జరిగిన తరువాత శాంతి మంత్రం వల్లిస్తుందే తప్ప తాము ఆక్రమించిన భూభాగం నుంచి చైనా అంగుళం కూడా వెనక్కు వెళ్లదని, ఆ చిన్న ముక్క భూభాగం కోసం చైనాతో గొడవపడటం ఇష్టంలేక వాటిని విడిచిపెడుతుంటాయని మిలటరీ అధికారులే చెపుతున్నారు. కనుక ఇప్పుడూ అదే జరిగి ఉండవచ్చునని అని అనుమానించక తప్పదు. 

అదీగాక 22 మంది భారత్‌ సైనికులను పొట్టన పెట్టుకొన్న చైనాను మనం దోషిగా నిరూపించలేకపోయాము. అందుకు ప్రతీకారం కోసం భారత్‌ ప్రయత్నిస్తే భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని చైనాకు కూడా తెలుసు అందుకే అది ఎటువంటి అపరాధభావన లేకుండా, ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా కేవలం ఒక కిలోమీటరు వెనక్కు వెళ్ళి నిలబడింది...మళ్ళీ మరోసారి ముందుకు వచ్చేందుకు! 

కనుక చైనా సేనలు తోకముడిచాయని జబ్బలు చరుచుకోలేము కానీ ఈ సందర్భంగా మన బలం, బలహీనతలు అన్నీ చూసుకోగలిగే అవకాశం కలిగినందుకు సంతోషించవచ్చు. మన సైనికులను అతికిరాతకంగా హత్య చేసిన చైనాను మనం ఏమీ చేయలేకపోయాము కనుక కనీసం చైనా వస్తువులు, సేవలు కొనుగోలు చేయకుండా ఉంటే అదే మన కోసం ప్రాణాలు అర్పించిన 22 మంది వీరజవాన్లకు నివాళులు...కృతజ్ఞతలు.


Related Post