ఆర్టీసీ కార్మికులకు ఈనెల పూర్తి జీతం

July 07, 2020


img

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు జూన్‌ నెల జీతాలలో ఎటువంటి కోత విధించకుండా పూర్తిగా చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి నుంచి జూన్‌ వరకు ఆర్టీసీ బస్సులు తిరుగకపోవడంతో ఆర్టీసీకి అసలు ఆదాయమే లేకుండా పోయింది. దాంతో మార్చి, ఏప్రిల్, మే నెలలో ఆర్టీసీ కార్మికులకు సగం జీతాలు మాత్రమే చెల్లిస్తోంది. కరోనా భయంతో నేటికీ సిటీ బస్సులు తిరుగకపోవడం వలన ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతూనే ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో జిల్లాల మద్యన సర్వీసులు, అంతర్ రాష్ట్ర సర్వీసులు, కొరియర్ అండ్ కార్గో సర్వీసులు నడుస్తుండటంతో ఆర్టీసీ ఆదాయం కొంతమేర పెరిగింది. కనుక ఈనెల ఆర్టీసీ కార్మికులకు పూర్తిజీతాలు చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఆర్టీసీలో జీతాల చెల్లింపుకి సుమారు రూ.160 కోట్లు అవసరం ఉంటుంది. అందుకు ఆర్టీసీ సిద్దపడుతోందంటే ఆర్టీసీకి అంతకంటే ఎక్కువగానే ఆదాయం సమకూరుతోందని భావించవచ్చు.       

55 రోజుల ఆర్టీసీ సమ్మె సమయంలో ఆర్టీసీ కార్మికులు జీతాలు లభించకపోవడంతో తీవ్ర ఆర్ధిక సమస్యలను ఎదుర్కోవలసివచ్చింది. వాటిని భరించలేక 36 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఎట్టకేలకు సిఎం కేసీఆర్‌ వారిని కరుణించడంతో ఆర్టీసీ సమ్మె ముగిసింది. అందరూ ఒడ్డున పడ్డామని సంతోషించేలోగా ఈ కరోనా మహమ్మారి మళ్ళీ  ఆర్టీసీ కార్మికులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. మూడు నెలలుగా సగం జీతాలతో ఆర్టీసీ కార్మికులు నానా కష్టాలు పడుతున్నారు. ఈ నెల పూర్తి జీతం అందితే వారికి... వారి కుటుంబాలకు తప్పకుండా కొంత ఊరట లభిస్తుంది.


Related Post