సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభం

July 07, 2020


img

హైకోర్టు ఆమోదం తెలుపడంతో సోమవారం అర్ధరాత్రి నుంచి సచివాలయం కూల్చివేత పనులు మొదలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలుగా మింట్ కాంపౌండ్, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ పరిసరప్రాంతాలలో బ్యారికేడ్లు ఏర్పాటుచేసి ట్రాఫిక్‌ను వేరే మార్గాలకు మళ్ళిస్తున్నారు. 

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు అనుమతించిన తరువాత కాంగ్రెస్‌, బిజెపిలు దానిని కరోనా ఆసుపత్రిగా మార్చి వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ వారు మళ్ళీ హైకోర్టుకు వెళితే వారి వాదనలతో హైకోర్టు ఏకీభవిస్తే సచివాలయం కూల్చివేతపై మళ్ళీ స్టే విధించే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సచివాలయం కూల్చివేత పనులను ప్రారంభించేసినట్లు భావించవచ్చు. కొత్త  సచివాలయం నిర్మాణానికి సిఎం కేసీఆర్‌ గత ఏడాదే శంఖుస్థాపన చేశారు కనుక ఈ నెలాఖరులోగానే కూల్చివేత పనులు పూర్తిచేసేసరికి శ్రావణమాసం కూడా మొదలవుతుంది కనుక వెంటనే నిర్మాణపనులు ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. సుమారు రూ.500-600 కోట్లు వ్యయంతో ఆరు లక్షల చదరపు అడుగులలో అత్యాధునిక సౌకర్యాలున్న నూతన సచివాలయాన్ని నిర్మించబోతోంది.   

 

ప్రస్తుతం కూల్చివేస్తున్న సచివాలయాన్ని 132 ఏళ్ళ క్రితం నిజాం నవాబుల కాలంలో నిర్మించారు. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలంగా నిర్మించబడిన ఆ అద్భుతమైన భవనానికి  ‘సైఫాబాద్ ప్యాలెస్’ అనే పేరుండేది. తరువాత దానిని ఉమ్మడి రాష్ట్రంలో సచివాలయంగా వినియోగించుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి గత ఏడాది వరకు అది సచివాలయంగానే కొనసాగింది. దానిలో జీ బ్లాక్ 1888లో నిర్మించబడగా, 2003లో డీ బ్లాక్, 2012లో నార్త్, సౌత్ బ్లాకులను నాటి ప్రభుత్వాలు నిర్మించాయి. ఒక్క సిఎం కేసీఆర్‌ తప్ప ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు అందరూ సచివాలయం నుంచే రాష్ట్రాన్ని పాలించారు. గత ఏడాదివరకు తెలంగాణ మంత్రులు కూడా ఆ సచివాలయంలోనే తమ ఛాంబర్లు ఏర్పాటుచేసుకొని తమతమ శాఖలను చూసుకొనేవారు. 


Related Post