కరోనా కట్టడి ఇక కష్టమేనా?

July 07, 2020


img

తెలంగాణతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే కొత్తగా 1,831 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 25,733కి చేరింది. గత వారం రోజులుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో జూలై 1న 881 కేసులు నమోదు కాగా ఆ తరువాత వరుసగా 998,1658,1572,1277 నిన్న అత్యధికంగా 1831 పాజిటివ్ కేసులు నమోదవడం చాలా ఆందోళన కలిగిస్తోంది. ఇదివరకు లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని అభ్యర్ధించినవారే ఇప్పుడు నగరంలో కరోనా తీవ్రతను చూసి భయపడి సికింద్రాబాద్‌, బేగంబజార్, జనరల్ బజార్, షాపూర్ నగర్ తదితర ప్రాంతాలలో దుకాణాలు వారం రోజులు స్వచ్ఛందంగా మూసుకొన్నారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. 

ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ రోజురోజుకీ కేసులు పెరుగుతూనే ఉండటంతో ప్రజలు సహకరిస్తే తప్ప కరోనా కట్టడి చేయడం అసాధ్యమని స్పష్టమవుతోంది. లాక్‌డౌన్‌ విధిస్తే తప్ప ప్రజలు వెనక్కు తగ్గేలాలేరు. కానీ లాక్‌డౌన్‌ విధిస్తే సామాన్య ప్రజల జీవనోపాధి దెబ్బ తింటుంది కనుక లాక్‌డౌన్‌ విధించలేని నిసహాయత నెలకొంది. ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన సమస్య కాదు అన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కరోనాను కట్టడి చేయడం ఆసాధ్యంగా మారడంతో దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరిగిపోతునే ఉన్నాయి. 

కరోనా వ్యాక్సిన్ ఒక్కటే ఈ సమస్యకు ఏకైక పరిష్కారంగా కనిపిస్తోంది. ఆగస్ట్ 15కల్లా అది అందుబాటులోకి వస్తుందని ఐసీఎంఆర్‌ చెపుతున్నప్పటికీ సాధ్యం కాకపోవచ్చునని వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు చెపుతున్నారు. కనుక అది అందుబాటులోకి వచ్చే వరకు దేశంలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉంటాయని స్పష్టం అవుతోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ రోగులు, మృతుల ఆ జాబితాలో మన పేరు ఉండకూడదనుకొంటే, వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటూ బయటకు వెళ్లినప్పుడు కరోనా సోకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోకతప్పదు. 


Related Post