కరోనాను అడ్డుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయా?

July 06, 2020


img

గతనెల 8నుంచి లాక్‌డౌన్‌ సడలించడంతో దేశవ్యాప్తంగా కరోనాకేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు జాతీయస్థాయిలో రోజుకు 7-8,000 కొత్త కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు రోజుకు 20,000కుపైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. అదేవిధంగా ఒకప్పుడు హైదరాబాద్‌ నగరంలో రోజుకు 100-140 కొత్త కేసులు నమోదుకాగా ఇప్పుడు రోజుకు 1,000-1,500 కేసులు నమోదవుతున్నాయి. దేశంలో, హైదరాబాద్‌ నగరంలో ఇంతవేగంగా కరోనా కేసులు పెరిగిపోవడానికి కారణాలు ఏమిటి? అనే ప్రశ్నకు ఒకటికాదు...అనేక సమాధానాలు వినిపిస్తున్నాయి. 

జాతీయస్థాయిలో... 

1. డిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాలలో విపరీతంగా కేసులు పెరిగిపోవడం. 

2. కరోనా మొదలైన కొత్తలో లాక్‌డౌన్‌ విధించి వలస కార్మికులను వారి ఇళ్ళలో నిర్బందించి స్వంత రాష్ట్రాలకు వెళ్ళకుండా అడ్డుకొని, కరోనా బాగా పెరిగిపోయిన తరువాత వారిని అనుమతించడం. తద్వారా వారు కరోనా రోగులుగా, వాహకులుగా మారడంతో దేశమంతటికీ కరోనా వ్యాపించింది. 

3. కరోనా బాగా పెరిగిన తరువాత ప్రత్యేక రైళ్ళు, శ్రామిక్ రైళ్ళు, దేశీయవిమాన సేవలను ప్రారంభించడంతో కరోనా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వ్యాపించింది. 

4. కరోనా తీవ్రత బాగా పెరిగిన తరువాత వందే భారత్‌ పేరుతో విదేశాల నుంచి భారతీయులను తిరిగి తీసుకురావడం. 

5. ప్రజల జీవనోపాధిని, దేశ ఆర్ధికవ్యవస్థను కాపాడుకోవడం కోసం లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడం. 

6. ప్రజలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటం.      

తెలంగాణ, హైదరాబాద్‌లో... 

1. ఒక వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతింటాయనే భయంతో లేదా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కరోనా పరీక్షలు చేయకపోవడం. 

2. కరోనా పరీక్షలు చేయకపోవడం వలన కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకోవడం. ఇప్పుడు కరోనా పరీక్షలు పెంచడంతో ఇంతవరకు గుర్తించకుండా వదిలేసిన కరోనా కేసులు ఇప్పుడు బయటపడుతుండటం.

3. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలింపు. 

4. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న డిల్లీ, ముంబై నగరాలు, గుజరాత్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి బారీ సంఖ్యలో తిరిగివచ్చిన తెలంగాణవాసుల ద్వారా కరోనా వ్యాప్తి.

5. నేటికీ చాలామంది ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటం.      

కనుక వీటి ఆధారంగా కరోనా కేసులు పెరగడానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయిప్పుడు. 1. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలలో లోపాలు, 2. ప్రజలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటం. ప్రభుత్వం, ప్రజలు ఈవిధంగా వరుస తప్పులు చేస్తుంటే కరోనా పెరగకుండా ఎలా ఉంటుంది?కనుక ఇప్పటికైనా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ‘ఇగో’ను పక్కనపెట్టి నిజాయితీగా తమ లోటుపాట్లను సవరించుకోవలసిన అవసరం ఉంది. అలాగే దేశప్రజలు కూడా కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మానుకొని ప్రభుత్వం సూచిస్తున్న అన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంది. అప్పుడే దేశం, రాష్ట్రం కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందుతుంది లేకుంటే ఈ విధ్వంసం కొనసాగుతూనే ఉంటుంది.


Related Post