ప్రగతి భవన్‌ సిబ్బందికి కరోనా?

July 03, 2020


img

సిఎం కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో పనిచేస్తున్న ఐదుగురు సిబ్బందికి కరోనా సోకినట్లు తాజా సమాచారం. అయితే సిఎం కేసీఆర్‌ గత నాలుగు రోజులుగా గజ్వేల్లోని తన సొంత ఇంట్లో ఉంటున్నారు. ప్రగతి భవన్‌లో సిబ్బందికి కరోనా లక్షణాలున్నట్లు అనుమానం కలుగగానే ఆయన అక్కడికి తరలివెళ్లిపోయారా లేక ఆయన అక్కడ ఉండగా ప్రగతి భవన్‌లో సిబ్బందికి కరోనా సోకిందా? అనే విషయం తెలియదు. కానీ వెంటనే వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది ప్రగతి భవన్‌లో శానిటైజేషన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. 

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలవడానికి నిత్యం పదుల సంఖ్యలో వివిద శాఖల ఉన్నతాధికారులు వస్తుంటారు. వారితో సిఎం కేసీఆర్‌ నిత్యం సమావేశాలు నిర్వహిస్తుంటారు. సిఎం కేసీఆర్‌ సచివాలయానికి వెళ్ళడం లేదు కనుక ప్రగతి భవన్‌లోనే మంత్రివర్గ సమావేశాలు కూడా నిర్వహిస్తుంటారు. కనుక ప్రగతి భవన్‌లోకి కరోనా వ్యాపించకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఇప్పుడు ఐదుగురు సిబ్బందికి కరోనా సోకడం నిజమైతే వారు ప్రగతి భవన్‌లో ఎవరెవరికి సన్నిహితంగా తిరిగారో వారందరినీ గుర్తించి పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది. ప్రగతి భవన్‌లో సిబ్బందికి కరోనా సోకినట్లు ప్రభుత్వం తరపున ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


Related Post